50 రోజులుగా నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్‌లు తిరిగి ప్రారంభం!

దాదాపు 50 రోజులుగా నిలిచిపోయిన వ్యవసాయ భూములు..వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ లు గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి లో మధ్యాహ్నం 12.30 నిమిషాలకు రైతుల సమక్షం లో ధరణి వెబ్ సైట్ నీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్ పాస్‌పుస్తకం చట్టం గురించి ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత 1000 మంది రైతులతో సమావేశం అవుతారు. చట్టం ప్రత్యేకతను వివరిస్తారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి, అభిప్రాయాలు స్వీకరిస్తారు. 2 వేల మంది పట్టేలా కార్యక్రమ ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 474 తహసీల్దార్ కార్యాలయాల్లో తహసీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వెనువెంటనే రికార్డుల్లో మ్యుటేషన్ సైతం చేపడతారు. ధరణిలో తొలి దశలో నాలుగు రకాల డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి తహసీల్దార్లకు అనుమతినిచ్చారు. భూముల విక్రయాలు, భూపంపకాలు,వారసులకు భూములపై అధికారం, గిఫ్ట్ డీడ్‌లను తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వాణిజ్య అవసరాల కోసం మార్చే అధికారం కూడా తహసీల్దార్లకే కట్టబెట్టడంతో పై నాలుగు రకాల డాక్యుమెంట్ల నమోదుతో పాటు వ్యవసాయేతర భూమార్పిడి అధికారంతో వారు బాధ్యతలు చేపట్టనున్నారు.
ధరణి ఆధారంగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేయనుండటంతో దీనికోసం 'తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకం చట్టం-2020'ను అనుసరించి, రూల్స్‌ను మార్పు చేశారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పిస్తూ జీవో కూడా జారీ అయ్యింది. ధరణి రికార్డులనే ప్రామాణికంగా చేసుకొని రిజిస్ట్రేషన్ లు జరుగుతుండటంతో 1.55 కోట్ల ఎకరాల పట్టా భూముల క్రయవిక్రయాలన్నీ తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరుగనున్నాయి. అయితే తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ జరగాలంటే విధిగా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిందే. స్లాట్ లేకుంటే రిజిస్ట్రేషన్ చెల్లదు.తొలుత ధరణి వెబ్‌సైట్లోకి వెళ్లి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ విభాగంపై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్ ఫోన్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ని కూడా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. కొనుగోలుదారులు, రైతుల ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు నమోదు చేసుకోవాలి. కుటుంబ సభ్యుల వివరాలు, కొనుగోలు చేసే విస్తీర్ణం, సర్వే నెంబర్ అన్నీ వివరాలు పొందుపరచాలి. రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ, పాస్‌పుస్తకం, మ్యుటేషన్‌ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
రైతు అంగీకారం లేకుండా ఒక్క అడుగు కూడా వెబ్‌సైట్‌లో పడదు. రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో కొనుగోలుదారుల నుంచి తీసుకునే ఆధార్ కార్డులోని వివరాలే రిజిస్ట్రేషన్‌కు ప్రామాణికం కానున్నాయి. ఆధార్ కార్డులోని ఫొటోయే భూమిపై ఇచ్చే పట్టాదార్ పాస్ పుస్తకం తొలిపేజీలో ముద్రిస్తారు. దాంతో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఇక రిజిస్ట్రేషన్ అనంతరం కొనుగోలుదారుల చిరునామాకే పట్టాదారు పాస్‌పుస్తకం చేరనుంది. ధరణి వెబ్‌సైట్ లో పొందుపరిచిన భూముల విలువలు చూస్తే... పాత విలువలనే ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు తేలింది. 49 రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో 5 లక్షలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com