ఆమెను చూస్తుంటే అమ్మవారిని చూసినట్లే ఉంది: పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య ప్రదర్శించిన మీనాక్షి కళ్యాణం నృత్యరూపకం కనులపండువగా సాగింది. నాట్యగురువు పసుమర్తి రామలింగశాస్త్రి దర్శకత్వంలో సౌజన్య కళాకారుల బృందం చక్కటి అభినివేశాన్ని ప్రదర్శించి కళాకారులను మంత్రముగ్ధుల్ని చేశారు.
మీనాక్షి పాత్రలో ఆమె చూపిన అభినయం అతిధులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. మాదాపూర్‌లోని శిల్పకళా ప్రాంగణం శుక్రవారం సాయింత్రం ఈ నృత్యప్రదర్శనకు వేదిక అయింది. కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోపాటు, సంగీత దర్శకులు తమన్, నటుడు తనికెళ్ల భరణి తదితరులు సౌజన్య బృందం అభినయించిన నాట్యాన్ని తిలకించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కూచిపూడి లాంటి సంప్రదాయ కళలను పరిరక్షించుకుని భావితరాలకు అందించాలన్నారు. మీనాక్షి పాత్రలో సౌజన్యను చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్లు అనిపించిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com