Disha Encounter : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సరిగ్గా రెండేళ్లు

Disha Encounter : దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగి నేటికి సరిగ్గా రెండేళ్లైంది. దిశను అత్యాచారం చేసి, దారుణంగా చంపేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం మొత్తాన్నీ కదిలించింది. అయితే, నిందితులు పది రోజుల్లోనే హతమవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిర్భయ నిందితులను దాదాపు ఆరేళ్ల పాటు జైల్లోనే ఉంచారు. వాళ్లు నిర్దోషులు అని చెప్పేందుకు కోర్టుల్లో నెలల తరబడి వాదనలు జరిగాయి. ఉరిశిక్షను తప్పించుకోడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాంటిది దిశ నిందితులు పదిరోజులు తిరిగే సరికే పోలీసుల ఆత్మరక్షణలో హతమవడంతో జనం పూలవర్షం కురిపించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి కూడా.
2019 నవంబర్ 27న స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద పెట్టి హైదరాబాద్ వెళ్లింది దిశ. రాత్రికి దిశ తిరిగి వస్తుందని కాపు కాసిన నిందితులు.. పక్కా ప్లాన్‌తో స్కూటీని పంక్చర్ చేసి, దిశను మాయమాటలతో నమ్మించి, బలవంతంగా ఎత్తుకుపోయారు. ప్రహరీ పక్కకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి, ఆమె ప్రాణాలు తీశారు. షాద్‌నగర్ శివారులోని చటాన్‌పల్లి బైపాస్ వంతెన కింద దిశను దహనం చేశారు. దిశను గ్యాంగ్‌రేప్ చేసి చంపేసిన నిందితులను రెండు రోజులు తిరక్కుండానే పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ 27న ఘటన జరిగితే.. నవంబర్ 29న నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చారన్న విషయం తెలుసుకున్న వేల మంది ప్రజలు.. వారిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ షాద్ నగర్ పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. భారీ బందోబస్తు మధ్య షాద్‌నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. పోలీసులు కస్టడీకి కోరడంతో డిసెంబర్ 3న కోర్టు 10 రోజుల కస్టడీకి ఇచ్చింది. డిసెంబర్ 6 తెల్లవారు జామున నలుగురు నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు పారిపోయేందుకు రాళ్లు విసిరారని, తమపై దాడికి దిగిన నిందితులపై ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. తెల్లవారుతూనే నిందితులు హతమయ్యారనే వార్త బయటికొచ్చింది. తగిన శాస్తి జరిగిందంటూ జనం వేడుకలు చేసుకున్నారు.
నిందితుల ఎన్‌కౌంటర్‌ను జనం హర్షించినా.. రేప్ కేసుల్లో నిందితులందరినీ ఇలాగే శిక్షిస్తారా అని కొందరు ప్రశ్నించారు. అది నిజమైన ఎన్‌కౌంటరా లేక బూటకపు ఎన్‌కౌంటరా తేల్చాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబ సభ్యులు సైతం న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వేసింది. ఈ కమిషన్‌కు సుప్రీం కోర్టు మాజీ రిటైర్డ్ జడ్జి సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా విచారణ ఆలస్యం అయింది. అయితే, వచ్చే ఫిబ్రవరి లోపు కమిషన్ తన నివేదికను సుప్రీం కోర్టుకు అందజేయాల్సి ఉండడంతో దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద సిర్పూర్కర్ కమిషన్‌కు వింత అనుభవం ఎదురైంది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్, దిశ మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించడానికి కమిషన్ సభ్యులు షాద్ నగర్ వెళ్లారు. కమిషన్ సభ్యులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారని తెలిసి.. వివిధ ప్రజా సంఘాలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రెండేళ్ల క్రితం నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు కూడా వేలాది మంది ఆందోళన చేశారు. వారిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్‌కౌంటర్ బూటకమా, కాదా అని తేల్చేందుకు వచ్చిన కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషన్‌ను రద్దు చేయాలంటూ వివిధ సంఘాలు ధర్నా చేపట్టాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com