Telangana: బీజేపీలో పదవుల చిచ్చు

తెలంగాణ బీజేపీలో పదవుల చిచ్చు రాజేసింది. పార్టీలో సంస్థాగత మార్పులపై మెజార్టీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయాలపై పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ తొలగింపుపై బాహాటంగానే బీజేపీ క్యాడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. కొత్త అధ్యక్షుడిగా నియమితులైన కిషన్‌రెడ్డి... కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయం పట్ల అయిష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్ మాత్రం హైకమాండ్ నిర్ణయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వంటి నేతలు బీజేపీలో కొనసాగాలా వద్ద అన్న డైలామాలో పడిపోయారు.
బండి సంజయ్‌ను తొలగించి కిషన్‌రెడ్డి నియమించడంపై పార్టీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే కిషన్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్న ప్రచారం ఊపందుకుంది. కిషన్‌రెడ్డి నియామకంపై సోషల్‌మీడియాలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. పట్టణాలకే పరిమితమైన బీజేపీ.. పల్లెలకు సైతం విస్తరించిన బండి సంజయ్‌ను అకారణంగా తొలగించారంటూ బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సంజయ్‌ను నమ్ముకొని బీజేపీలో చేరిన నేతలు కూడా ఇప్పుడు సందిగ్దంలో పడిపోయారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని పక్క పార్టీల వైపు చూస్తున్నారు.
బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై సంజయ్ బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేయకున్నా పార్టీ అధ్యక్షుడు నడ్డాతో తన ఆవేదనను పంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని.. జాతీయ నాయకత్వం చెప్పిందల్లా చేశానని ఇప్పుడు ఉన్నపళంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చేరికల సమయంలో పలువురు నాయకులకు టికెట్ హామీ ఇచ్చారు. ఇప్పుడు వారంతా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయారు. మరో వైపు ఈటల రాజేందర్ హైకమాండ్ నిర్ణయంపై హ్యాపీగా ఉన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించారు.
మరో వైపు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్‌రెడ్డి సైతం ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. ప్రకటన తర్వాత ఢిల్లీకి వెళ్లిన కిషన్‌రెడ్డి ఉదయం నుంచి నివాసానికి పరిమితమయ్యారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కిషన్‌రెడ్డి సుముఖంగా లేరన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు కిషన్‌రెడ్డి అధ్యక్ష పదవి విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా పదవిని స్వీకరిస్తారా? ఆయన తుదపరి కార్యాచరణ ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. సంజయ్ స్థాయిలో పనిచేయకుంటే తనపై అసమర్థుడి ముద్ర పడుతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ హైకమాండ్ నిర్ణయం పట్ల డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి, రఘునందన్‌రావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వంటి నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యామ్నయం అన్న రీతిలో బీజేపీ నాయకత్వం నిర్ణయాలు ఉన్నాయని నాయకులు సన్నిహితులు వద్ద వాపోతున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో మరికొంత మంది బీజేపీ నాయకులు ఇదే బాటలో పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలసలను ఆపడం బీజేపీకి కష్టతరంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com