తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ..!

TS Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ రేషన్‌కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆయా జిల్లాల్లో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అర్హులైన 3 లక్షల 9 వేల 83 మందికి కొత్త కార్డులను జారీచేసింది పౌరసరఫరాల శాఖ. కొత్త కార్డులు పొందినవారికి ఆగస్టు నెల నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.
రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ఇందుకోసం ప్రతియేట సుమారు 2 వేల 766 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. ఇప్పటికేఉన్న కోటాకు అదనంగా 168 కోట్ల రూపాయలతో 5 వేల 200 టన్నుల బియ్యాన్ని అధికారులు సమకూరుస్తున్నారు. కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే అధికంగా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 87.41 లక్షల కార్డులు ఉండగా.... 2.79 కోట్ల మంది లబ్ధిదారులున్నారు.
కొత్తకార్డుల సంఖ్యతో కలిపి 90.50 లక్షలకు చేరనుంది. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్య 2.88 కోట్లకు చేరుకుంటుంది. 2.88 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతినెలా 6 కిలోల చొప్పున 1.72 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com