TS: అధికారులు, వైద్యుల మధ్య "ఎలుక" వివాదం

కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఎలుకలు రోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలోనూ వరంగల్ MGM ఆస్పత్రిలోనూ మూషికాల బెడద చర్చనీయాంశ మైంది. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిపై ఎలుక దాడి చేసిన గాయపర్చిన వ్యవహారం.. అధికారులు, వైద్యుల మధ్య వివాదంగా మారింది. ICUలో ఉన్న ఓ రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో వైద్యుల మీద వేటు పడింది. పారిశుద్ధ్య విభాగం తప్పునకు తమను సస్పెండ్ చేయటం సరికాదని వైద్యులు నిరసన తెలిపారు. వైద్యశాఖ మంత్రిని కలిసి సస్పెన్షన్ ఎత్తేయాలని వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు ఎలుకల బెడద పట్ల రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
`కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ICUలో రోగిని ఎలుకలు గాయపర్చడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ ఇద్దరు వైద్యులు, ఒక స్టాఫ్ నర్స్‌ను సస్పెండ్ చేశారు. ఆస్పత్రి పర్యవేక్షకురాలిని విధుల నుంచి తప్పించారు. ఎలుకల సంచారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో అధికారులు, వైద్యుల మధ్య వివాదం ఏర్పడింది. నిర్వహణ లోపాలకు తమను బాధ్యులుగా చేయడమేంటంటూ వైద్యులు కామారెడ్డి జిల్లా ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. తగిన సౌకర్యాలు, సిబ్బంది లేకపోయినా మెరుగైన సేవలందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి సస్పెన్షన్ ఎత్తేయాలని విన్నవించారు.
ఆస్పత్రిలో ఎలుకల సంచారంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోగులకు మధ్యాహ్న భోజనం పెట్టే కేంద్రంలోని పప్పులు, బియ్యం తినేందుకు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి తోడు ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. 150 పడకల ఆసుపత్రిని శుభ్రం చేసేందుకు సరిపడా కార్మికులు లేరు. పలు చోట్ల తలుపులు ధ్వంసం కాగా.... కిటికీలకు జాలీలు కరవయ్యాయి. ఎలుకలు విద్యుత్తు తీగలను కొరుకుతుండటంతో ఇప్పటి వరకు 20 ACలు పాడయ్యాయి. తరచూ మరమ్మతులు చేపట్టాల్సి వస్తుండటంతో నిధులు వృథా అవుతున్నాయి. ఎలుకల బెడదపై రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదాలను పక్కనపెట్టి.. ఆసుపత్రిలో ఎలుకల బెడద నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com