CAMPAIGN: ఇంటింటిని చుట్టేస్తున్న అభ్యర్థులు

CAMPAIGN: ఇంటింటిని చుట్టేస్తున్న అభ్యర్థులు
తెలంగాణలో ముమ్మరంగా సాగుతున్న ప్రచారం.... ఓటరు దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు నేతల తిప్పలు

తెలంగాణలో శాసనసభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో అన్ని రాజకీయపార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమకే ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో కొత్తపేట మారుతీనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌ పాదయాత్ర చేస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సతీమణి విజయలక్ష్మి జనప్రియ మహానగర్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌.. రోడ్‌షో చేపట్టారు. తొమ్మిదన్నర సంవత్సరాల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు, బడుగు బలహీన వర్గాలను మోసం చేసి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలో తెలపాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.


హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ప్రేమ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి కృష్ణయాదవ్‌తో కలిసి కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గ గడ్డి అన్నారంలో డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పాదయాత్రగా ప్రచారం నిర్వహిస్తూ టీ అమ్ముతూ, క్షవరం చేస్తూ ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం మనికేశ్వరి నగర్‌లో బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్‌ అభ్యర్థి జోగురామన్న కుమారుడు.. పురపాలక సంఘం అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌ ఆదిలాబాద్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి సాయి మౌనారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్‌ శంకర్‌ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ, తిర్పెల్లి కాలనీల్లో ర్యాలీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో వాకర్లని కాంగ్రెస్‌ అభ్యర్థి.. వివేక్‌ ఓట్లు అభ్యర్థించారు.


నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బోధన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి తన అనుచరులతో కలిసి వర్గల్ మండలంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ ఓట్లు అభ్యర్థించారు. హైదరాబాద్ నగరంలో కల్లోలం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణపై మరోసారి కన్నేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలో... హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన సతీమణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story