REVANTH: హైడ్రా అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు... మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు16 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు ఇప్పటికే అధికారులు సర్వే చేశారు. 10,200 మంది నిర్వాసితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా ఏర్పడి ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో చెప్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా రివర్ బెడ్ ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. మూసీ బఫర్ జోన్ లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మాణ ఖర్చుతో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. 2 BHK ఇల్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.
యువత కోసం కొత్తగా...
సీఎం రేవంత్ రెడ్డి మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న సర్కార్.. అటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఓవైపు.. నోటిఫికేషన్లు వేస్తూ పరీక్షలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ప్రైవేట్ సెక్టార్‌లోలోనూ ఉద్యోగాలు పొందేలా యువతను సిద్ధం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో.. దేశంలోనే సరికొత్త ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోంది. అదే జాబ్ గ్యారెంటీ స్కిల్ కోర్సులను ప్రవేశపెట్టి.. యువతకు ట్రైనింగ్ ఇవ్వాలని యోచిస్తోంది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు.. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేలా చర్యలకు రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. రెగ్యులర్ డిగ్రీ కోర్స్‌లతో పాటు, నైపుణ్య శిక్షణను అందించేలా బీఎఫ్ఎస్ఐ కోర్సును కూడా అదనంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ కోర్సును ప్రారంభం కానుంది.
ఈ కాలేజీల్లోనే...
ఈ ప్రత్యేక కోర్సును అందించే కళాశాల లిస్టును రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి చేత గుర్తించబడిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఎంపిక చేయగా.. ఈ కాలేజీల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు మొదటగా.. ఈ కోర్సు కింద ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com