భాగ్యనగర్‌లో డబుల్ డెక్కర్.. కొన్ని రోజులు ఉచితంగా ప్రయాణం

భాగ్యనగర్‌లో డబుల్ డెక్కర్.. కొన్ని రోజులు ఉచితంగా ప్రయాణం
ఎప్పుడో చిన్నప్పుడు చూశాం.. మళ్లీ ఇప్పుడు భాగ్యనగర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు విహరిస్తున్నాయి.

ఎప్పుడో చిన్నప్పుడు చూశాం.. మళ్లీ ఇప్పుడు భాగ్యనగర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు విహరిస్తున్నాయి. నగర ప్రజలకు ఓ తియ్యని అనుభూతిని అందించేందుకు సరికొత్తగా ముస్తాబు చేసిన డబుల్ డెక్కర్ బస్సులను తీసుకువచ్చింది హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ). ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ వెల్లడించారు. రూ.12.96 కోట్లతో గతంలోనే ఈ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసింది.

ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని రూట్లలో మాత్రమే ఈ బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కామసీద్‌తో పాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ నడుస్తుంది. ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్ బండ్‌కు చేరుకుంటాయి. ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు.

నగర వాసులకు కొన్ని రోజులపాటు ఈ బస్సులలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు హెచ్‌ఎండీఏ అధికారులు. అనంతరం కనీస ఛార్జి విధించే అవకాశం ఉందని అన్నారు. ప్రయాణీకుల స్పందన బట్టి మరి కొన్ని రూట్లలో కూడా డబుల్ డెక్కర్ నడిచే అవకాశం ఉందని అన్నారు. అదనంగా మరో 30 వరకు ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు తీసుకురానున్నట్లు ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story