TG: ఉద్యోగ క్యాలెండర్‌పై సందేహాలు..?
తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమయ్యేలా ఉద్యోగ క్యాలెండర్ రూపొందించినా కొన్ని పరీక్షల షెడ్యూలు అభ్యర్థులకు ఇబ్బందిగా మారనుంది. ఒకే రకమైన విద్యార్హతలు, ఒకటే కేటగిరీ పోస్టులకు వేర్వేరు నియామక సంస్థలు ఒకే సమయంలో విడివిడిగా ప్రకటనలు జారీ చేయనున్నాయి. దీంతో పరీక్షలకు మధ్య స్వల్ప వ్యవధి ఉండటం సమస్యగా మారనుంది. ఈ తరహా పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని నోటిఫికేషన్లకు ఉద్యోగ ప్రకటన జారీ, దరఖాస్తు స్వీకరణ, పరీక్షకు ఇచ్చే గడువు స్వల్పంగా పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్‌లో కొన్ని నోటిఫికేషన్ల షెడ్యూలుపై పలు సందేహాలు నెలకొన్నాయి.
వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అధికారులు, ఫార్మసిస్టులకు ఈ ఏడాది సెప్టెంబరులో వైద్య ఆరోగ్య నియామకాల బోర్డు ప్రకటన జారీ చేయనుంది. ఉద్యోగ ప్రకటన జారీ తర్వాత దరఖాస్తుల స్వీకరణకు కనీసం 15 నుంచి 30 రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత రాతపరీక్షకు కనీసం 45 రోజుల నుంచి మూడు నెలల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు 2024 నవంబరులో పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. దీంతో కనీస గడువు లభిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 2022లో జారీ చేసిన గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనకు రాతపరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హత. దీంతో అభ్యర్థులు ఏదైనా ఓ పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితులున్నాయి. డిసెంబరులోనే గ్రూప్-2 రాతపరీక్షల షెడ్యూలు ఉంది.
పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఇచ్చిన షెడ్యూలులో ప్రకటన, దరఖాస్తు, పరీక్షలకు మధ్య కనీస వ్యవధి ఇబ్బందులు రానున్నాయి. డీఎస్సీ ఉద్యోగ ప్రకటన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుండగా ఏప్రిల్‌లో పరీక్షలని ప్రకటించారు. మరోవైపు ఏప్రిల్‌లోనే డిగ్రీ, పీజీ అర్హతలతో గెజిటెడ్ స్థాయి అధికారుల నోటిఫికేషన్‌లో పరీక్షల షెడ్యూలు ఖరారైంది. ఈ రెండింటి మధ్య గడువు సమస్య నెలకొననుంది. గ్రూప్-3 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ 2025 జులైలో రానుంది. దీనికి అర్హత ఏదైనా డిగ్రీ. అదే సమయంలో సింగరేణిలో బీఈ, బీటెక్, ఇతర అర్హతలతో కూడిన ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. ఈ రెండింటి పరీక్షల షెడ్యూలు 2025 నవంబరు. వీటి మధ్య వ్యవధి లేకుంటే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com