Drugs Case: రాడిసన్‌లో డ్రగ్స్ కేసు లో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌లోని డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల బ్లడ్ శాంపిల్స్ డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చాయని మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపారు. హోటల్‌లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారని పార్టీల్లో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారో లేదో పూర్తిగా నిర్ధరణ కాలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లో డ్రగ్స్ సేవించిన కేసులో మంజీరా గ్రూప్ డైరెక్టగా ఉన్న వివేకానంద్ సహా మరో ఎనిమిది మందిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి హోటలో కొకైన్ సేవిస్తున్నారన్న సమాచారంతో మాదాపూర్ ఎస్ వోటి పోలీసులు సోదాలు చేశారు. అయితే వివేకానంద్‌కు డైరెక్టర్ క్రిష్‌కు పరిచయం ఎన్నాళ్లుగా ఉందో తెలియదన్న పోలీసులు... నిందితులు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ వ్యవహారంలో సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ బుధవారం పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు మంగళవారం క్రిష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విచారణకు హాజరవ్వాలని, ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు. అయితే.. తాను బయట ఉన్నానని, బుధవారం విచారణకు వస్తానని క్రిష్ చెప్పినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ మహంతి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘‘క్రిష్‌ను విచారిస్తాం. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు క్రిష్ ఈ కేసులో అనుమానితుడు మాత్రమే. నేరం చేశారా? లేదా? అనేది తేలాల్సి ఉంది’’ అని ఆయన వివరించారు. ఈ కేసులో ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు ఉన్నట్లు సమాచారం. గతంలో రాడిసన్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీల్లో ఆయన పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. దర్యాప్తు అధికారులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. క్రిష్‌తోపాటు.. లిషి గణేశ్ పేర్లు వెలుగులోకి రావడంతో.. తాజా ఘటన మరోసారి టాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది.
క్రిష్‌తోపాటు సెలబ్రిటీలు శ్వేత, నీల్, సినీనటి లిషి, సందీప్, రఘుచరణ్ ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు గచ్చిబౌలి, ఎస్‌వోటీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ చెప్పారు. వారు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనేదాన్ని బట్టి కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com