Telangana: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ శాఖపై ఆరోపణలు..

Telangana: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ శాఖపై ఆరోపణలు..
Telangana: మెడికల్ షాప్‌లపై డేగకన్నుతో వాచ్‌ చేయాల్సిన డ్రగ్ కంట్రోల్ విభాగం నిర్లక్ష్యంతో ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.

Telangana: తెలంగాణలో హోల్‌సెల్, రిటైల్ మందుల దుకాణాలు , మెడికల్ షాప్‌లపై అనునిత్యం డేగకన్నుతో వాచ్‌ చేయాల్సిన డ్రగ్ కంట్రోల్ విభాగం నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల‌కు పైగా హోల్ సేల్‌, రిటైల్ మెడికల్ షాప్‌లుండగా ఒక్క హైద‌రాబాద్‌లోనే 15 వేల‌కు పైగా దుకాణాలు, 70 రక్తనిధి కేంద్రాలున్నాయి. వీటిపై నిత్యం పర్యవేక్షణకు రాష్ట్రంలో 56 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లు ఉండగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 18 మంది విధులు నిర్వహిస్తున్నారు.

ఒక్కో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు 400 నుంచి 500 వరకు మెడికల్‌ దుకాణాలపై పర్యవేక్షణ బాధ్యలను అప్పగించారు. వీటితోపాటు నెలకు కనీసం 25 షాప్‌లనైనా తనిఖీ చేయాలన్న ఆదేశాలున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏక్కడా నిర్దేశించిన పనులు చేయటం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

అటు రాష్ట్రంలో బ్లడ్‌ బ్యాంక్‌ల ఏర్పాటు, మెడికల్ షాప్‌లకు అనుమతులు, మందుల తయారీ సంస్థలపై పర్యవేక్షణ .. అన్నీ డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్ కనుసన్నల్లోనే కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మెడికల్ దుకాణాలలపై అజమాయిషీ, తనిఖీలు లేకపోవటంతో వీరి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. డ్రగ్స్ కంట్రోల్ సిబ్బంది డిమాండ్ మేరకు.. మాముళ్లు అందిస్తే.. మెడికల్ షాప్‌లవైపు కన్నెత్తిచూడరని స్థానికులు చెబుతున్నారు. మాముళ్ల మత్తులో డ్రగ్ కంట్రల్‌ అధికారులు..ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని స్థానికులు మండి పడుతున్నారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ మెడికల్ షాప్‌లలో అర్హతలు గల సిబ్బందే లేరన్న ఆరోపణలున్నాయి. అమ్మకాల చిట్టి ఇవ్వకుండానే మెడిసిన్స్‌ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెడ్యూల్ డ్రగ్స్ ను , ప్రత్యేక శిక్షణ పొందిన ఫార్మసిస్ట్‌ అమ్మాల్సి ఉండగా ఈ నిబంధనలు ఏమాత్రం పాటించటం లేదు. మెడికల్ దుకాణాల్లో వెటర్నరీ డ్రగ్, హ్యుమన్ డ్రగ్స్ వేర్వేరుగా ఉంచాలన్న నిబంధనలు ఎక్కడా పాటంచటంలేదు. అజమాయిషీ కోసం నిబంధనలు కఠినంగానే ఉన్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయని విశ్లేషకులు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story