HYD: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

HYD: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం
2.7 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్‌

కొత్త సంవత్సర వేడుకల వేళ మాదక ద్రవ్యాలపై తెలంగా. పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మూడు కమిషనరేట్ పరిధుల్లో SOT, టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు తెలంగాణా నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు... కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. నగరంలోకి మాదక ద్రవ్యాలు ప్రవేశిస్తే చాలు... వెంటనే సమాచారం అందేంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వేడుకల్లో మాదక ద్రవ్యాలు స్వీకరిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు...మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు రోజుల్లోనే భారీగా మాదక ద్రవ్యాల్ని పట్టుకున్నారు. శంషాబాద్ పరిధిలో శనివారం ద్విచక్ర వాహనంపై 2.7కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా.. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గంజాయి సహా, మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్వరం జోన్ ఎస్‌వోటి పోలీసులు ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


హైదరాబాద్ కమిషరేట్ పరిధిలోని వారాసి గూడ వద్ద 7.5కిలోల గంజాయిని మధ్య మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓయూ పోలీస్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను ఆగ్నేయ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2.6కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సాయి నవీన్, చాట్ల వంశీ సులభంగా డబ్బు సంపాదించేందుకు నూతన సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో మీర్ పేట పోలీస్టేషన్ పరిధిలో హెరాయిన్ విక్రయిస్తున్న ముగ్గురు రాజస్థాన్ వాసుల్నిL.B నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15గ్రాముల హెరాయిన్ తో పాటు మూడు చరవాణులు, 10వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్న రాచకొండ సీపీ సుధీర్ బాబు... డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జూబ్లిహిల్స్ పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ ను తరలిస్తున్న ఇద్దరు యువకుల్ని పశ్చిమ మండల టాస్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల MDMA, 2 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లోని ఓ ప్రముఖ యూనివర్శిటిలో చదువుతున్న విద్యార్థులు... అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత నాలుగేళ్లుగా నూతన సంవత్సరం కోసం డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది. నిందితులు సూరి, లీల నవీన్ గా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story