Drug Addiction:కొత్త సంవత్సరం వేళ డ్రగ్స్ కలకలం

Drug Addiction:కొత్త సంవత్సరం వేళ డ్రగ్స్ కలకలం
X
పెరిగిన పబ్ సంస్కృతి.. డ్రగ్స్ మత్తులో యువత

ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం జోష్‌ మొదలైంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు దేశాలన్నీ సిద్ధమైపోయాయి. యువత కూడా సంబరాలకు సిద్ధమైపోయింది. అయితే ఈ సంబరాల్లో డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం.. భయాందోళనలు రేకెత్తిస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగం పెరుగుతూనే ఉంది. ఈ మత్తులో పడి యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటోంది.

న్యూ ఇయర్‌ పార్టీ అంటే మందు.. విందు.. చిందు.. తప్పక ఉండాల్సిందేనని యువత ఫిక్సయిపోయింది. ఈ సరదా సమయంలో మత్తు తోడైతే మజా మరింత పెరిగి పిచ్చిగా మారుతుందని భావిస్తోంది. ఈ పిచ్చే వారిని నరకకూపంలోకి నెట్టేస్తుంది. సవాళ్లు, ఒత్తిళ్లతో యువత తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి డ్రగ్స్‌ వైపు అడుగులేస్తోంది. స్నేహితులు బలవంతం చేయడం, సులభంగా డ్రగ్స్‌ దొరకడం, పెరిగిన పబ్‌ సంస్కృతి పయువతను డ్రగ్స్ తీసుకునేలా చేస్తున్నాయి. వీటివల్ల భవిష్యత్తు తరాలు నిస్తేజంగా మారిపోతున్నాయి.

సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో డ్రగ్స్‌ వినియోగాన్ని సాధారణ అంశంగా, ఫ్యాషన్‌గా చూపుతున్నారు. కొందరు సినీ హీరోలు పొగాకు ఉత్పత్తులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ ను ప్రోత్సహించే ఇలాంటి ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. డ్రగ్స్ తీసుకుని ఊహా ప్రపంచంలో విహరిస్తున్న యువతకు.. వాస్తవ ప్రపంచంతో సంబంధం తెగిపోతోంది. అప్పటికే డ్రగ్స్ కు అలవాటు పడిన యువత నూతన సంవత్సరం లాంటి వేడుకల్లో అదుపు తప్పుతున్నారు. విపరీతంగా డ్రగ్స్ తీసుకుని తమ జీవితాలను ముగించేస్తున్నారు. డ్రగ్స్, మద్యం తాగి వాహనాలు నడపుతూ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. చాలా మంది యువత మద్యం, డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం నుంచైనా వీటికి దూరంగా ఉండాలి. మంచి ఆలోచనలతో ఉన్నతంగా ఎదిగేలా ముందుకు సాగాలి.

Tags

Next Story