DSC: నేటి నుంచే డీఎస్సీ హాల్‌టికెట్లు

DSC: నేటి నుంచే డీఎస్సీ హాల్‌టికెట్లు
ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు... వాయిదా వేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలు

తెలంగాణలో నేడు డీఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న.. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఆందోళనలు

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీని వాయిదా వేయాల్సిందేనని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో వదిలేశారు. వారు అక్కడి నుంచి నేరుగా ఓయూ ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సహచర విద్యార్థులు వారికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చారు. వీరంతా మాట్లాడుకుని.. తెల్లవారుజామున వసతిగృహాలకు వెళ్తుండగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పదుల సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ కొందరు విద్యార్థులు ఓయూలోని ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ వద్ద సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో విద్యార్థులు చేరుకుంటుండగా.. ఓయూ పోలీసులు విద్యార్థులను వెంటాడి మరీ అదుపులోకి తీసుకున్నారు. తమ సహచరులను తీసుకెళ్లిన పోలీసులు వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, ఎక్కడికి తరలించారో చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


డీఎస్సీని మూణ్నెల్లు వాయిదా వేయాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు ఓయూ ఐకాస నాయకుడు మోతీలాల్, భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, విజయ్‌ సహా పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్‌ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు.

కేటీఆర్‌ మద్దతు

డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి.. ఇప్పుడు వారిని దగా చేస్తారా? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ‘25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మాట ఇచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు కొలువుదీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా? డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారు. న్యాయం జరిగే వరకు అభ్యర్థులకు గులాబీ జెండా అండగా ఉంటుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నేతన్నలపై కక్ష కట్టి వారి ప్రాణాలు తీస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు.

Tags

Next Story