దుబ్బాక ఉపఎన్నిక : కోవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు

దుబ్బాక పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దుబ్బాక మండలం లచ్చపేట శివారులోని గురుకుల పాఠశాలలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు అందచేశారు. పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ భారతీ హోలికేరి, సీపీ జోయెల్ డెవిస్ సమీక్షించి.... పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని చెప్పారు. నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించేలా మార్కింగ్ చేశారు. మాస్క్, గ్లౌస్ తప్పనిసరి అని నిబంధన విధించారు. 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. 130 మంది కోవిడ్ రోగులు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం ఇచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. కోవిడ్ రోగులు పోలింగ్ జరిగే చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటు వేయడానికి వచ్చే కోవిడ్ రోగులకు పీపీఈ కిట్ సదుపాయం కల్పించనున్నారు.
దుబ్బాక నియోజకవర్గ పరిధిలో లక్షా 98 వేల 756 మంది ఓటర్లు ఉండగా... వెయ్యి మందికి ఓ పోలింగ్ కేంద్రం ఉండేలా... 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 33 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని గుర్తించి... అక్కడ భారీ బలగాల్ని మోహరించారు. మైక్రో అబ్జర్వర్లను నియమించారు. నియోజకవర్గం పరిధిలో పోలీసులు 10 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే 3600 మంది సిబ్బందికి రెండు సార్లు శిక్షణ అందించారు. సీసీ కెమెరా, వీడియో గ్రఫీ ద్వారా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.
అటు... ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో నిర్వహించిన తనిఖీల్లో 58 లక్షల రూపాయల నగదు, 58 వేల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. వీటిలో 2 లక్షల రూపాయలకు ఆధారాలు చూపెట్టడంతో తిరిగి ఇచ్చామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి.... సీ-విజిల్ ద్వారా 50కి పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. దుబ్బాక నియోజకవర్గంలో 4వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు. పోలింగ్ అనంతరం భద్రత కోసం... 14 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత కోసం సీఆర్‌పీఎఫ్ బలగాలు, ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉండనున్నా యి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com