దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ.. బీజేపీ నేత ఇంటికి రేవంత్ రెడ్డి

దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ.. బీజేపీ నేత ఇంటికి రేవంత్ రెడ్డి
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో టీఆర్‌ఎస్‌ దూకుడు మరింత పెంచింది..

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో టీఆర్‌ఎస్‌ దూకుడు మరింత పెంచింది.. దుబ్బాకలోనూ విజయం ఖాయమని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధీమాగా కనబడుతున్నాయి.. అటు టీఆర్‌ఎస్‌లో చేరికలు జోరందుకున్నాయి. అసంతృప్తులు పార్టీలు మారుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముద్దుల నాగేశ్వర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలో ముద్దుల నాగేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఈసారి టిక్కెట్‌ దక్కకపోవడంతో కారెక్కారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో చేరికల కార్యక్రమం సందడిగా సాగింది.

దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అయిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. గతంలో ఏం చేశారని.. కాంగ్రెస్‌ నేతలు ఓట్లు అడుగుతున్నారని హరీష్‌రావు ప్రశ్నించారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని అన్నారు. ఫార్మాసిటీని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని ఆయన ఎదురుదాడి చేశారు. హుజూర్‌నగర్‌లో చెల్లని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట దుబ్బాకలో చెల్లుతుందా అని హరీష్‌రావు ఎద్దేవ చేశారు. మీ పార్టీ నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు.

అటు దుబ్బాకలో గెలుపు కోసం కాంగ్రెస్‌ కూడా పావులు కదుపుతోంది.. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి.. ఆయనతో రహస్య మంతనాలు జరిపారు.. పార్టీలోకి రావాలని కోరారు. బీజేపీలో నిబద్ధతతో పనిచేసే నాయకుడు కమలాకర్‌రెడ్డి అంటూ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను మోసిన నేతలను కాదని, మూడుసార్లు ఓడిపోయిన ఒకే వ్యక్తికి ఈ ఉప ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. చివరి వరకు రామలింగారెడ్డి వెంటే ఉన్నామని చెబుతున్న టీఆర్‌ఎస్‌ అగ్రనేతలు మరి ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నికతో చేరికలు మరింత జోరందుకున్నాయి.. ఇటు టీఆర్‌ఎస్‌, అటు కాంగ్రెస్‌, బీజేపీ విజయం కోసం చెమటోడుస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story