చివర్లో యాక్సిలేటర్ తొక్కినా దుబ్బాకను చేరుకోలేకపోయిన కారు

దుబ్బాకలో బీజేపీ దుబ్బ రేపింది. చివర్లో యాక్సిలేటర్ తొక్కినా కారు మాత్రం దుబ్బాకకు చేరుకోలేకపోయింది. మధ్యలో కొన్ని రౌండ్లలో బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించి కారు దూసుకెళ్లినట్లు కనిపించినా... చివరి మూడు ఓవర్లలో మూడు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను గెలిపించినట్లుగా.. మూడు రౌండ్లలో పూర్తి ఆధిక్యం ప్రదర్శించి దుబ్బాకలో పాగా వేసింది కమలం పార్టీ.
దుబ్బాక ఫలితం అచ్చం ఐపీఎల్‌ను తలపించింది. చివరి రౌండ్ వరకు రసవత్తరంగా కొనసాగింది. ఐపీఎల్ సూపర్ ఓవర్‌లో కూడా ఇంత మజా ఉండదేమో. అంతలా ఉత్కంఠ రేపింది దుబ్బాక ఎన్నికల ఫలితం. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన హోరా హోరీ పోరులో.. దుబ్బాక గడ్డపై కాషాయ జెండా ఎగరవేసింది బీజేపీ. టీఆర్‌ఎస్‌పై 1118ఓట్లతో ఘన విజయం సాధించారు బీజేపీ అభ్యర్ధి రఘనందన్‌రావు. దీంతో సంబరాల్లో మునిగియారు ఆ పార్టీ శ్రేణులు.
చివరి రౌండ్ వరకు ఉత్కంఠగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో నువ్వా నేనా అన్నట్లు ఫలితం రెండు పార్టీల మధ్య దోబుచులాడింది. కానీ 22వ రౌండ్‌లో ఎప్పుడైతే లీడ్‌లోకి వచ్చిందో... అప్పుడే బీజేపీ విజయం దాదాపు ఖాయమైపోయింది. బిహార్‌తో పాటు ఎన్నో రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు చూపు మాత్రం దుబ్బాక ఎన్నికల ఫలితం మీదే. క్షణం క్షణం మారుతున్న లీడింగ్స్ అందరిలో తీవ్ర ఉత్కంఠను క్రియేట్ చేశాయి. అసలు టీఆర్‌ఎస్ గెలుస్తుందా? బీజేపీ గెలుస్తుందో తేల్చుకోక అంతా సందిగ్ధంలో పడిపోయారు. కౌంటింగ్ ఆరంభం నుంచే బీజేపీ ఆధిక్యత ప్రదర్శించింది. తొలి ఐదు రౌండ్లలో లీడ్‌లో దూసుకెళ్లిన కమలం... ఏకంగా 4 వేల ఆధిక్యతను సాధించింది. అయితే ఆరు, ఏడు రౌండ్లలో మాత్రం కారు ఆధిక్యతను చూపించింది. మళ్లీ 8 రౌండ్‌లో దూసుకొచ్చిన బీజేపీ.. టీఆర్‌ఎస్‌పై సంపూర్ణ ఆధిక్యతను సాధించింది. అప్పటికే బీజేపీ విజయం ఖాయమైనట్లే అని ఆ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమైన సమయంలో.. అనూహ్యంగా 12వ రౌండ్ నుంచి కారు గేరు మార్చింది. 19 రౌండ్ల వరకు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. ఇంకేముంది అంతా టీఆర్‌ఎస్ విజయం ఖాయమనుకున్నారు. ఇదే సమయంలో 20వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ స్వల్ప ఓట్లతో ఆధిక్యంలో వచ్చింది. ఇంకా మూడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వరుసగా మూడు రౌండ్లను తన ఖాతాలో వేసుకని దుబ్బాక సీటును కైవసం చేసుకుంది బీజేపీ. టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానంలో సంచలన విషయాన్ని నమోదు చేసింది.
బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావుకు 62 వేల 772 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61 వేల 302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 21 వేల 819 సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com