క్లైమాక్స్‌కు చేరిన దుబ్బాక ఎన్నికల ప్రచారం

క్లైమాక్స్‌కు చేరిన దుబ్బాక ఎన్నికల ప్రచారం

దుబ్బాక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. నవంబర్‌ 1న సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగియనుండటంతో... పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తన ప్రచారంలో ప్రధానంగా బీజేపీనే టార్గెట్‌ చేస్తోంది. కేంద్ర నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారంటూ ఆరోపిస్తున్నారు గులాబీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు రాజకీయ ఆరోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అటు కాంగ్రెస్‌ సైతం.. విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి హరీష్‌ రావ్‌ ఫైర్‌ అయ్యారు. బీజేపీ నేతలు ఝూటా మాటలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక ఎన్నిక గెలవాలని బీజేపీ నేతలు ఆశపడుతున్నారన్నారు. కాని దుబ్బాక ప్రజలు చాలా తెలివైనవారని.. మోసపూరిత ప్రచారాలు నమ్మరన్నారు. సత్యమేవ జయతే అనే నానుడిని మార్చి అసత్యమేవ జయతేగా బీజేపీ మార్చేసిందని ఆరోపించారు.

దుబ్బాక ఉప ఎన్నికలో... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. దుబ్బాకలో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ప్రజల మద్దతుపై ఆధారపడి పోటీ చేస్తుంటే టీఆర్‌ఎస్‌ అధికారంపై ఆధారపడిందని విమర్శించారు కిషన్‌రెడ్డి. దుబ్బాక నియోజకవర్గంప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారన్నారు

అటు కాంగ్రెస్‌ నేతలు సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైతులు, విద్యార్ధులు, ఉద్యోగులు టీఆర్‌ఎస్‌ పట్ల విముఖత చూపిస్తున్నారని, కాంగ్రెస్‌ గెలుపు ఖాయమంటున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్‌, బీజేపీకి మధ్యే పోటీ ఉందని, టీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితమైవుతుందన్నారు కాంగ్రెస్‌నేత పొన్నం ప్రభాకర్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలిస్తే... ఫాంహౌసులో ఉన్న కేసీఆర్‌ బయటికి వస్తారన్నారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story