బీహార్‌కు మాత్రమే ఉచితంగా కరోనా మందు పంపిణీ చేస్తారా?: హరీశ్‌రావు

అధికార, విపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దుబ్బాక ఉపఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం... ఒక్క బీహార్‌కు మాత్రమే ఉచితంగా కరోనా మందును పంపిణీ చేస్తానని అనడం ఏంటని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల గెలుపు కోసమే కరోనా మందు ఉచిత పంపిణీ అంశం తెరపైకి తెచ్చారని అన్నారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కాలిపోయిన మీటర్లు, బీజేపీ గెలిస్తే బాయికాడ మోటర్లు వస్తాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని హరీశ్‌రావు తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
దుబ్బాకలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు.. టీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. బీజేపీ గెలిస్తే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని బెదిరించడం దారుణమని పోతారం గ్రామంలో నిర్వహించిన రోడ్‌షోలో మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నేతలు సంస్కారవంతంగా మాట్లాడాలని హితవు పలికారు. దుబ్బాక పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో మాజీమంత్రి బాబు మోహన్ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్దికి నోచుకోలేదని విమర్శించారు. ప్రశ్నించే వారినే గెలిపించాలని కోరారు.
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్, గొడుగుపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనుల్ని గుర్తించి.. తనను గెలిపించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com