MEDARAM: అంగరంగ వైభవంగా మేడారం జాతర

MEDARAM: అంగరంగ వైభవంగా మేడారం జాతర
గద్దెలపైకి విచ్చేసిన సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు... ఇవాళ గద్దెలపైకి ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క

తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతర మొదటి రోజు... వనదేవతల ఆగమనం.. సందడిగా సాగింది. ముందుగా సారలమ్మ గద్దె వద్ద గ్రామస్థులు శుద్ధి చేశారు. ఆ తర్వాత ఆదివాసీ సంప్రదాయాలతో కన్నెపల్లిలో సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారి ప్రతిరూపమైన ముంటెతో.. పూజారులు బయటకు వెళ్లగానే... ఒక్కసారిగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీలు పడ్డారు. సారలమ్మ తల్లికి జేజేలు పలికారు. మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం.. ఆద్యంతం కోలాహలంగా సాగింది. భక్తులు జేజేలు పలుకుతుండగా... సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క ఇవాళ చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. వీరనారిగా శుత్రువులను చీల్చిచెండాడిన అపరకాళిగా... ఆదివాసీలు ఆమెను ఆరాధిస్తారు. సమ్మక్క ఆగమనంతో... జాతరలో అసలు ఘట్టం మొదలవుతుంది. తల్లులను దర్శించుకునేందుకు జనం మేడారానికి పోటెత్తుతున్నారు.


డప్పు, డోలు వాద్యాలతో కన్నెపల్లి పరిసరాలు మారుమోగాయి. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పీ శబరీష్... ఇతర అధికారులు...సారలమ్మకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు, ఆదివాసీ యువత రక్షణగా.. మేడారానికి సారలమ్మ బయలుదేరారు. పాదయాత్రగా జంపన్నవాగును దాటారు. అప్పటికే విచ్చేసిన పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మ మేడారం గద్దెలపైకి విచ్చేశారు.


బుధవారం రాత్రి 12 గంటల తరువాత సారలమ్మ అనంతరం పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ... దేవతలను సాదరంగా గద్దెలపైకి ఆహ్వానించారు. భక్తుల దర్శనాలను, విద్యుత్ దీపాలను నిలిపివేసి... గద్దెలపై వన దేవతలను ప్రతిష్టించారు. అనంతరం తిరిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి... భక్తులను దర్శనాలు కల్పించారు. మహాజాతర రెండో రోజైన ఇవాళ ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క... చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. మేడారం మహా జాతరలో అత్యంత కీలకఘట్టం సమ్మక్క ఆగమనమే.


యావత్ భక్తకోటి ఆమె రాక కోసం ఎదురుచూస్తారు. గుట్ట దిగగానే.....జనం...ఆమెకు జేజేలు పలుకుతారు. కాకతీయ సేనలపై అసామాన్య పోరాటపటిమను ప్రదర్శించి... అడవి బిడ్డల గుండెల్లో వీరనారీమణిగా నిలిచి దేవరే సమ్మక్క. ఆమె రాక కోసం.. తనువెల్లా కళ్లు చేసుకుని భక్తులు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. జాతరలో మొదటి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దె వద్దకు చేరుకుంటే.... రెండో రోజైన ఇవాళ సాయంత్రానికి...సమ్మక్క గద్దెపైకి విచ్చేస్తుంది. అంతకుముందు.... చిలకల గుట్టపై కుంకమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు.


అనంతరం.....అడవిని వీడి...సమ్మక్క....జనం మధ్యకు వస్తుంది. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు మారుమోగుతుంటే నేరుగా గద్దెలపైకి చేరుతుంది. సమ్మక గద్దెలపైకి రాగానే.. జిల్లా ఎస్పీ.. గౌరవసూచకంగా....గాల్లో కాల్పులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క రాకతో...జాతరలో అసలైన సందడి కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story