Loan App Suicide : లోన్ యాప్ వేధింపులకు ఎంసెట్ ర్యాంకర్ బలి..

Loan App Suicide : లోన్ యాప్ వలలో చిక్కి ఓ ఎంసెట్ ర్యాంకర్ ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కరీంనగర్‌కు సమీపంలోని నగునూరుకు చెందిన శ్రీధర్ - పద్మ దంపతుల కుమారుడు మునిసాయి. ఇటీవల ఎంసెట్ పరీక్షల్లో మునిసాయికి 2000 ర్యాంకు వచ్చింది. సంతోషంలో మునిగిపోయిన ఆ కుటుంబం... ముని సాయి ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేశారు. కౌన్సిలింగ్‌కు హాజరు కావడానికి హైదరాబాద్‌కి వచ్చి శంషాబాద్ లోని తన స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. వివిధ కాలేజీల వివరాలు సేకరిస్తూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడు. కౌన్సిలింగ్ కాగానే పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచన చేశాడు.
అయితే 4 నెలల క్రితం ఎలా ట్రాప్ లో పడ్డాడో ఏమో గాని లోన్ అప్ మెసేజ్ రావడంతో లోన్ కోసం అప్లై చేశాడు. కేవలం పదివేల రూపాయల లోన్ ఎం-పాకెట్, ధని యాప్ ల ద్వారా తీసుకున్నాడు. యాప్ నిర్వాహకులు వరుసగా ఫోన్ చేస్తూ బెదిరించడంతో ఇప్పటికి 45 వేల రూపాయలు కట్టాడు. అంతటితో ఆగని యాప్స్ సిబ్బంది మరో 15వేలు కట్టాలని, అతని వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనంటూ బెదిరించారు. చీటర్ అంటూ ఫోటోలు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో ఆందోళనకు గురైన మునిసాయి...ఈ నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం మృతి చెందాడు. మునిసాయి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com