EC: ఎన్నికల సజావుగా జరిగేందుకు సిఈవో చర్యలు

EC: ఎన్నికల సజావుగా జరిగేందుకు సిఈవో చర్యలు
X
కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని నియోజకవర్గాలపై ఈసీ దృష్టి

దేశంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు EC ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... సైబర్‌ నేరాలు, విద్వేష ప్రసంగాలు, ప్రలోభాల వంటి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. హింస, పోలింగ్ కేంద్రాల ఆక్రమణ తదితరాల్ని నియంత్రించేందుకు కేంద్రీకృత సమాచార వ్యవస్థ అవసరం. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు CEO కార్యాలయంలో సమీకృత నియంత్రణ వ్యవస్థ ఏర్పాటైంది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ నిరంతరం పనిచేయనుంది.

రాష్ట్రంలోని మొత్తం 35 వేల 356 పోలింగ్‌ కేంద్రాల క్షేత్రస్థాయి పరిస్థితులను ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా క్లుప్తంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు జారీ చేస్తుంటారు. తనిఖీలు, స్వాధీనాలు, ఎన్నికల నియమావళి, ప్రచార ఉల్లంఘనలు, ఫిర్యాదులు, నిఘా బృందాలపై సమన్వయంపై దృష్టి పెట్టారు. C-విజిల్‌ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులు, సువిధ తదితర అంశాలు కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎల్లప్పుడూ పరిశీలిస్తారు. 18 డిస్టిలరీలు, ఆరు బ్రూవరీల దగ్గర పరిస్థితులను సైతం కమాండ్‌ కేంద్రం తెలుపుతుంది. 15 శాటిలైట్‌ ఛానెళ్లు, 3 యూట్యూబ్‌ ఛానెళ్లనూ ఇక్కడ నుంచి పరిశీలించనున్నారు


జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్న కంట్రోల్‌ రూమ్‌లన్నీ... ఈ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్ రూమ్‌ పరిధిలోకి వస్తాయి. 2వేల 217 MCC ఉల్లంఘనలు, నగదు స్వాధీనాలు, రాజకీయ పార్టీల ప్రకటనలను ఇప్పటి వరకు పరిశీలించారు. 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను జాతీయ ఫిర్యాదుల పరిష్కార విభాగంలో నమోదు చేస్తారు. గత అక్టోబరు 9 నుంచి ఇప్పటి వరకు 694 ఫిర్యాదులు వచ్చాయి. 85 ఫ్లైయింగ్ సర్వేలెన్స్‌ బృందాలు, FST వాహనాలు అందుబాటులో ఉంటాయి. C- విజిల్‌ యాప్‌కు ఇప్పటి వరకు 4వేల 643 ఫిర్యాదులు రాగా...వాటిలో 2వేల 858 వాస్తవమని గుర్తించి పరిష్కరించారు.

రాష్ట్రంలో నామినేషన్లు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు వీలుగా సువిధ యాప్‌ రూపొందించారు. సమావేశాలు, ప్రదర్శనలకూ ఈ యాప్‌ ద్వారా అనుమతులు పొందవచ్చు. ఓటరు సైతం తన వివరాలు, ఎన్నికల ఫలితాలు, EVMలు వాడే విధానాలు సువిధ ద్వారా తెలుసుకోవచ్చు. ఈనెల 16 వరకు 26వేల 554 విజ్ఞాపనలు అందగా వీటిలో 19వేల 114 అనుమతించారు. 3వేల 626 విన్నపాలు తిరస్కరించగా...మిగతావి పరిశీలనలో ఉన్నాయి. 437 చెక్‌పోస్టుల్లో 882 CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో 33 కంట్రోల్‌ రూములు పనిచేస్తున్నాయి.

EVMలు, పోలింగ్‌ ప్రక్రియ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘంపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలును పరిశీలిస్తారు. వాటికి తగిన విధంగా సత్వరమే స్పందించేలా పోలీసు, IT రంగ నిపుణులతో ఒక బృందం పని చేస్తోంది. ఇప్పటి వరకు 25 తప్పుడు కథనాలను గుర్తించినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Tags

Next Story