Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్
విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఈసీ

హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చివరి రోజున నిన్న(మంగళవారం) కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఐపీసీ 171సీ,ఎఫ్, 188, 506, 123 ఆర్పీ యాక్ట్ కింద బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సంజీవ్ తెలిపారు. ఎవరు కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్‌స్పెక్టర్ సంజయ్ కోరారు.

తనను గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే తన శవయాత్రకు రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా పరిగణించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్‌రెడ్డి నిన్న తన భార్య, కుమార్తెతో కలిసి హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను గెలిపించకుంటే కుటుంబమంతా కలిసి కమలాపూర్ బస్టాండ్‌లో ఉరేసుకుంటామని హెచ్చరించారు. తనకు ఓటేసి గెలిపించకుంటే ముగ్గురు శవాలను చూడాల్సి వస్తుందన్నారు. ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే 4న తన శవయాత్రకు రావాలని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓటర్లను ఆయన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ పలు పార్టీల నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ దర్యాప్తునకు ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story