KTR: కేటీఆర్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కీలక పరిణామం సంభవించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా, తాజాగా ఈ అంశంలో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారు. ఇందులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజీనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. కేటీఆర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు ఫైల్ చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుల నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేయగా... ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్ల కాపీలు ఇవ్వాలని ఈడీ ఏసీబీని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా... విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
కేటీఆర్‌కు భారీ ఊరట
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తైనందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకరరావు, గండ్ర మోహన్‌రావు వాదించారు. ఏసీబీ పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని.. ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరారు. 'ఈ కేసుకు ముఖ్యంగా 13(1)(a), 409 సెక్షన్లు వర్తించవని... ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవని.. ప్రొసీజర్ పాటించలేదనడం సరికాదని అన్నారు.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అయితే, ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com