ED: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ED: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
X
ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో మరో కీలక పరిణామం... జనవరి 7న విచారణకు హాజరుకావాలని ఆదేశం

ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీ లాండరింగ్‌, పెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. అయితే వారిని మాత్రం జనవరి 2 లేదా 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులో ఈడీ తెలిపింది.

తెలంగాణ హైకోర్టుకు కేటీఆర్

ఇప్పటికే ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్‌.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది.

ఏసీబీ పిటిషన్

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో ‘కేటీఆర్ నాట్ టు అరెస్ట్’ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా.. న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించారు.

Tags

Next Story