Hyderabad ED Raid : పొలిటికల్ హీట్‌ను పెంచిన హైదరాబాద్ ఈడీ రైడ్స్..

Hyderabad ED Raid : పొలిటికల్ హీట్‌ను పెంచిన హైదరాబాద్ ఈడీ రైడ్స్..
X
Hyderabad ED Raid : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతున్నాయి

Hyderbad ED Raid : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతున్నాయి. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల మరోసారి సోదాలు నిర్వహించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓసారి సోదాలు నిర్వహించిన ఈడీ... తాజాగా మరోసారి సోదాలకు దిగింది. హైదరాబాద్‌లోని చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసులో ఈడీ అధికారులు పది గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు. శ్రీ ఎంటర్‌ ప్రైజెస్‌లో డిజిగ్నేటెడ్‌ పార్టనర్‌గా బుచ్చిబాబు ఉన్నారు. దోమల్‌ గూడలోని బుచ్చిబాబు ఇంట్లో సోదాలు జరిపి పలు కీలక ఆధారాలు సేకరించారు.

హైదరాబాద్‌ డీడీ కాలనీలో ఉంటున్న బుచ్చిబాబు ఉద్యోగి శ్రీధర్‌ ఇంట్లో మరో టీమ్‌ సోదాలు జరిపింది. అలాగే శ్రీధర్‌ను దోమల్‌గూడలోని బుచ్చిబాబు ఇంటికి ఈడీ అధికారులు తీసుకువచ్చారు. శ్రీధర్‌ ఇంట్లో లభించిన ఆధారాలతో...సీఏ బుచ్చిబాబును అధికారులు ప్రశ్నించారు. మరిన్ని వివరాలు అతని నుంచి సేకరించారు.

మాదాపూర్‌ జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని అనూస్‌ కార్యాలయంలోనూ ఈడీ సోదాలు జరిగాయి. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రక్షణలో సోదాలు జరిపారు. అటు.. గచ్చిబౌలిలోని అభినయ రెడ్డి ఇంట్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోదాలు కొనసాగాయి.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపైనా ఈడీ గురిపెట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలోని మాగుంట నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈడీ బృందాలు తనిఖీలు చేశాయి. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌ సమీపంలోని శ్రీనివాసులు రెడ్డి కార్యాలయంలో అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. అలాగే అతని సన్నిహితుల ఇళ్లల్లోనూ ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేశారు. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని విచారించారు. కార్యాలయంలోకి ఎవరిని రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ తనకు నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టంచేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ట్వీట్‌ చేశారు. కొంత మంది ఢిల్లీలో కూర్చొని తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Tags

Next Story