Editorial: జనవరిలో జజ్జనకరి జనారే...

Editorial: జనవరిలో జజ్జనకరి జనారే...
కోల్డ్ వేవ్ లో హై ఓల్టేజ్ హీట్...

కోల్డ్ వేవ్ తాకిడికి అత్యంత చలితో వణుకుతున్న తెలంగాణలో రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సంక్రాంతి తర్వాత మరింత కాక పుట్టించనున్నాయి. వరస సభలతో ప్రధాన రాజకీయ పక్షాలు వేగం పెంచనున్నాయి. అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి మోడీ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా యాత్రలతో ముందుకు వెళ్లానున్నారు. ఈ నెలలో ఇంచుమించు అన్ని పార్టీలు సమరభేరికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.



గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎలాగైనా వందకు పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని కెేసీఆర్ ఢంకా భజాయించి చెప్తున్నారు. ఇక బీజేపీ తాజాగా మిషన్ 90 పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలతో జోష్ నింపుతూ గట్టి పోటీ ఇవ్వడానికి సహాయత్తమవుతోంది.



మునుగోడు ఎన్నికల తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేల ఎరకేసుతో బీజేపీ - బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. నువ్వంటే నువ్వు అనే రీతిలో సై అంటున్నాయి. తెలంగాణ టీడీపీ కూడా సత్తా చాటడానికి సమాయత్తమవుతోంది. మొత్తం మీద ఈ జనవరి నెల తెలంగాణ రాజకీయ ప్రకంపనలకు వేదిక కానుంది.



ఈనెల 18వ తేదీన కేసీఆర్ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభతో రాబోవు ఎన్నికలకు సమర శంఖం పూరించనున్నారు. ఖమ్మంలో ఇటీవల తెలంగాణ టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది. సీపీఎం పార్టీ కూడా మహాసభలను ఖమ్మంలోనే నిర్వహించింది. టీటీడీపీ సభ సక్సెస్ కావడంతో కెేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెప్తున్నారు.



ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలోకి చేరడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో బీఆర్ఎస్ సభ పెట్టి హిట్ చేసి పార్టీ నుంచి పోయే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే సంకేతాలు కేసీఆర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఖమ్మం సభతో కేసీఆర్ సమర శంఖం పూరించి... ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభలు నిర్వహించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.



బీజేపీ కూడా ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని పావులు కదుపుతోంది. అమిత్ షా కనుసన్నలలో భారీ స్కెచ్ వేసింది. ఇప్పటికే పార్టీ బలోపేతం చేయడంతో పాటు.. మండల స్థాయి నుంచి కూడా బాధ్యతలను కేటాయించింది. మోదీ స్వయంగా తెలంగాణలో జరిగే పరిణామాలను గమనిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జగన్ భేటీ అయినప్పుడు మోదీ స్వయంగా తెలంగాణలో షర్మిల ఎపిసోడ్ ను ప్రస్తావించారు అంటే ఆయన ఎంత నిశితంగా తెలంగాణలో జరిగే పరిణామాలను గమనిస్తున్నారో అర్థమవుతుంది.



ఈనెల 18న ఖమ్మంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. 19వ తేదీన హైదరాబాద్ కు ప్రధాని మోదీ రానున్నారు. విజయవాడ హైదరాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సుమారు 7వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ లో నిర్వహించే సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.



కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని కెసిఆర్, బిఆర్ఎస్ మంత్రులు ప్రతిరోజు చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ నేతల మాటలను ప్రధాని మోదీ స్వయంగా ఈ సభ ద్వారా తిప్పికొట్టే అవకాశాలున్నాయి. అలాగే కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో.. ఏం చేయబోతుందో ప్రస్తావించే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధుల ను ఏ విధంగా దారి మళ్లించిందో కూడా ప్రధాని ప్రస్తావించే ఛాన్స్ ఉంది.



ప్రధాని హైదరాబాదు సభకు బిజెపి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 19న ప్రధాని రావడం.. 18న కేసీఆర్ సభ ఉండడం తెలంగాణలో రాజకీయ వేడిని రగిలిస్తోంది. అలాగే, తెలంగాణ టీడీపీ కూడా త్వరలో జైత్రయాత్ర ప్రారంభించబోతోంది.



మొత్తం మీద తెలంగాణ ఎన్నికల ముగిసే వరకు రాజకీయ పక్షాల మధ్య వ్యూహ ప్రతి ఊహలతో పొలిటికల్ హిట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏడాది ముందుగానే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం రంగంలోకి దిగడం విశేషం.



Tags

Read MoreRead Less
Next Story