Editorial: రసవత్తరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం

Editorial: రసవత్తరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం
పొంగులేటికి కాంగ్రెస్ ఆ హామీ ఇచ్చిందా…? పొంగులేటిని కారు దిగకుండా ఆపేది ఎవరు…?

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ప్రతీ రాజకీయ పార్టీ కూడా ప్రత్యర్ధుల కంటే పార్టీలో ఉన్న నాయకులతోనే ఎక్కువ డైలమాలో ఉంటుంది అనే మాట వాస్తవం. గతంలో కాంగ్రెస్, టీడీపీ అయినా ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయినా సరే ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. సామాజిక వర్గాల లెక్కలు ఎక్కువగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో... రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల చుట్టూనే రాజకీయం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇదే జరుగుతుంది.

2018 ఎన్నికల సమయంలో పువ్వాడ అజయ్ కుమార్ కు తుమ్మలకు మధ్య చిన్నపాటి యుద్దమే నడిచి, పొంగులేటితో కలిసి తుమ్మలను పాలేరులో ఓడించారు అనే కామెంట్ వినపడింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పువ్వాడ... నామాకు మద్దతు ఇచ్చారని... ఆయన మాట ప్రకారమే... టీడీపీ నుంచి వచ్చిన నామాకు ఎంపీ సీటు ఇచ్చారనే మాటలు వినిపించాయి. గత మూడేళ్ళ నుంచి పరిస్థితులు నిధానంగా మారుతూ వస్తున్నాయి. పువ్వాడ, నామా వర్గ ఆధిపత్యం ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉందనే భావనల్లో పొంగులేటి ఉన్నారనే టాక్ ఉంది.

అందుకనే ఆయనకు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదని, రాజ్యసభకు సైతం పంపలేదని ఆయన గుర్రుగా ఉన్నారనే మాట జిల్లాలో వినపడింది. రెండేళ్ళ క్రితం ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కాని ఎందుకో తెలియదు కేసీఆర్ పై తనకు నమ్మకం ఉందని పొంగులేటి ప్రకటన చేసారు. ఇప్పుడు మళ్ళీ ఆయన పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. తన సామాజిక వర్గ నేతలతో పాటుగా గతంలో కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళను ఆయన జిల్లా వ్యాప్తంగా కలుస్తున్నారు.

సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట, మధిర, పాల్వంచ వంటి నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. చిన్న కార్యక్రమం ఉన్నా సరే పొంగులేటి తప్పక హాజరు అవుతున్నారు. ఇదే సమయంలో గ్రామ స్థాయి నాయకులతో ఆయన మమేకం అవుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సమావేశంలో కేసీఆర్, కేటిఆర్ ఫోటోలు లేకుండా సమావేశం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. ఇక ఆయన బయటకు రావడం... ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి అమిత్ షాను కలిసి కాషాయ జెండా కప్పుకోవడమే ఆలస్యం అనుకున్నారు.

కాని ఖమ్మం సభ తర్వాత సీన్ రివర్స్ అయింది. పొంగులేటి ఆ సభ విషయంలో సైలెంట్ గానే ఉన్నారు. సభ తర్వాత ఆయనతో కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్ళారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం వస్తే కచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని లేదంటే ఏదోక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపిస్తామని కాంగ్రెస్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అటు బిజెపి నుంచి మాత్రం ఖమ్మం ఎంపీ సీటు హామీ ఉంది. అధికారంలోకి వస్తే కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా హామీ ఇచ్చింది అని టాక్. అయితే జిల్లాలో ఉన్న పరిస్థితిని అంచనా వేసుకుంటున్న పొంగులేటి డైలమాలో ఉన్నారనే మాట బలంగా వినపడుతుంది.

బిజేపి ఖమ్మం ఎంపీ సీటు ఇచ్చినా సరే గెలవడం అంత సులువు ఏం కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస కష్టపడినా రెండు స్థానాలే వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీ పొత్తు ప్రభావం ఎక్కువగా కనపడింది. కాంగ్రెస్ కేడర్ జిల్లాలో బలంగా ఉంది. అటు రేణుకా చౌదరి వర్గం కూడా జిల్లాలో బలంగానే ఉంది. ఆమె మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపించే కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉంది. దీనితో ఆయన సన్నిహితులతో చర్చలు జరిపి అడుగులు వేసేందుకు సిద్దమవుతున్నారు.

ఇక అధికార పార్టీ నుంచి ఆయన కారు దిగకుండా ఆపడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. పొంగులేటి పార్టీ మారితే జిల్లాలో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన బుజ్జగిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నామా... ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని టాక్ నడుస్తుంది. ఏది ఎలా ఉన్నా ఈ డైలమాకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనపడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story