Editorial: కారు ఓవర్ లోడ్ తో ఇంటిపోరు

Editorial: కారు ఓవర్ లోడ్ తో ఇంటిపోరు
పదిహేను నియోజకవర్గాల్లో అసమ్మతి సెగ; మూడో సారి అధికారంలోకిరావాలంటే ప్రతిసీటు కీలకమే; ఇతరపార్టీలవైపు చూస్తున్న కొందరునేతలు; ఎమ్మెల్సీ గా ఉన్నా..ఎమ్మెల్యేగా పోటీకే కాలుదువ్వుతున్న గులాబీ నేతలు; ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి..


ఎన్నికల ఏడాది కావడంతో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల రేసు మొదలైంది. ఓవైపు ప్రస్తుత ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు అనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికి..అశావాహూలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకు అసమ్మతి నెలకొంది.

పోటాపోటిగా కార్యక్రమాలు చేస్తున్నవారు కొందరయితే...టికెట్ వస్తే ఓకే..లేకుంటే పక్కపార్టీలోకి జంపు అన్న విధంగా మరికొందరి ప్రయత్నాలున్నాయి. కాంగ్రెస్ , టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఇంటిపోరు కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో టికెట్ రానివారికి ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీలుగా చాన్స్ దక్కినప్పటికీ వారు సైతం ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగాలనే ఉవ్విళూరుతున్నారు. మరికొందరు తమ వారసులను దింపేందుకు పోటాపోటి రాజకీయాలు చేస్తున్నారు.


మూడోసారి అధికారంలోకి రావాలంటే చాల కష్టపడాల్సి ఉంటుంది. అటు బీజేపీ, కాంగ్రెస్ తామే బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయనే విధంగా తమ రాజకీయాల స్పీడ్ పెంచాయి. 2014, 2018 రెండు టర్మ్ ల్లో టీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే కాకుండా..ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సైతం బీఆర్ఎస్ లోచేర్చుకోవడంతో కారు ఓవర్ లోడు అయిందనే మాట వాస్తవం. అటు సొంతబలం పెంచుకోవడంతోపాటు .. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో బలమైన అభ్యర్దులు, ఎమ్మెల్యేగా పోటి చేయాలనుకుంటున్న ఆశావాహులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది.. ఇదే బీఆర్ఎస్ లో అసమ్మతి నేతలు తమ వాయిస్ పెంచేందుకు కలిసివస్తోందంటున్నారు. మూడోసారి అధికారం లోకి రావాలంటే ప్రతిసీటు కీలకమే. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి.. ఎన్నికల ఏడాది కావడంతో మంత్రులు, కీలకనేతల పర్యటనల్లోనే విభేదాలు బయటపడుతున్నాయి..పోటాపోటి కార్యక్రమాలతో తమబలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రతి జిల్లాల్లో ఇదే సీను కనిపిస్తోంది.ఇటివల ఎమ్మెల్సీ కవిత భూపాలపల్లి పర్యటనకు వెళితే ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామణారెడ్డి , మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదన్ చారి వర్గాలు హడావుడి చేశాయి.. తమ నేత పేరు శిలాఫలకంలో లేదంటూ మధుసూదనాచారి వర్గం ఆందోళనచేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచిపోటిచేసిన గండ్ర మధుసూదనాచారీ పై గెలిచి ..టీఆర్ఎస్ లోచేరారు.. దీంతో గులాబీ పార్టీలో రెండు గ్రూపులు తయారయ్యాయి.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనూ మాజీ డిప్యూటీ సీఎంలు ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.


బాహాటంగానే విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఆరూనూరైనా తానే తిరిగి పోటి చేస్తానని రాజయ్య కరాఖండీ గా చెపుతుంటే.. కడియం సైతం ఈసారి తన కూతురును రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఇద్దరూ సీనియర్ నేతలే..ఒకరు కాంగ్రెస్ నుంచి మరొకరు టీడీపీనుంచి బీఆర్ఎస్ లోచేరారు.. వచ్చే ఎన్నికల్లో ఇద్దరిమద్య సయోద్య కుదురుతుందో లేదో చూడాల్సిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కు మద్య విభేదాలున్నాయి. జెడ్పీ చైర్మన్ గా కోవాలక్ష్మి, ఎమ్మెల్యే గా ఆత్రం సక్కు ఇద్దరూ నియోజకవర్గంలో పోటాపోటి కార్యక్రమాలు చేస్తున్నారు..

ఇక ఖమ్మం జిల్లాల్లో ఆ నియోజకవర్గం మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు నడుస్తోందనే చెప్పాలి. రెండు టర్మ్ ల్లోనూ ఇతర పార్టీలో గెలిచిన వారు అధికారపార్టీలో చేరడం తో .. ఓడిన వారు ..చేరిన వారిమద్య విబేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి.. ఇల్లందు నియోజకవర్గంలో 2014 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోరం కనుకయ్య టీఆర్ఎస్ లో చేరారు. ఆతర్వాత టీఆర్ఎస్ నుంచిపోటి చేసి ఓడిపోయారు. గెలిచిన హరిప్రియ నాయక్ సైతం ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. కోరంకనుకయ్య జెడ్పీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో ఇద్దరి మద్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కోరం కనుకయ్య బీఆర్ఎస్ అసమ్మతి నేత.. ఇతరపార్టీలవైపు చూస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా పోటా పోటి కార్యక్రమాలు చేపడుతున్నారు.. పొంగులేటితోపాటే ..తన రాజకీయం అంటూ స్పష్టం చేస్తున్నారు.


మరోనియోజకవర్గం పినపాకలో సైతం పొంగులేటి వర్సేస్ బీఆర్ఎస్ గా నడుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారాపు సైతం కాంగ్రెస్ లోగెలిచి బీఆర్ఎస్ లోచేరారు. 2014 లో గెలిచిన పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ లోచేరి..2018 లో రేగా కాంతారావు చేతిలో ఓడిపోయారు. పాయం వెంకటేశ్వర్లు పొంగులేటి వర్గం కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. వైరా లో మదన్ లాల్ వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యేరాముల్ నాయక్ , కొత్తగూడేంలో జలగం వెంకట్రావు 2014 లో గెలిచారు. 2018 లో కాంగ్రెస్ అభ్యర్ది వనమా వెంకటేశ్వరరావు పై ఓడిపోయారు..అనంతరం వనమా టీఆర్ఎస్ లోచేరారు.. జలగం బీఆర్ఎస్ లో ఉన్నప్పటికి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. వనమా వెంకటేశ్వర్రావు కొడుకు ఎపిసోడ్ తో బీఆర్ఎస్ టికెట్ వనమా వెంకటేశ్వర్రావు కు మరోసారి డౌటే అంటున్నారు. జలగం కు మరోసారి పార్టీలో ప్రధాన్యత పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక పాలేరులో సైతం తుమ్మల వర్సెస్ కందాల ఉపెందర్ రెడ్డి గా నడుస్తోంది.. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న తుమ్మల .. బీఆర్ఎస్ ఖమ్మం మీటింగ్ సందర్బంగా హరీష్ కేసీఆర్ నేరుగా తుమ్మలతో చర్చలు జరిపడంతో ..తుమ్మల యాక్టివ్ గా తన రోల్ పోషించారు.. బీఆర్ఎస్ లోనే తాను కొనసాగుతాను అన్న సంకేతాలిచ్చారు.. ఒక రకంగా ఖమ్మంలో బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి గా రాజకీయాలు మారాయన్నది వాస్తవం.

ఇక నల్గొండ జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోచేరారు. ఓడిన వేములవీరేశం చిరుమర్తి మద్య మూడేళ్లు్గా పార్టీ లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అసమ్మతి నడుస్తోంది. ఇటివల మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలోనే వేముల వీరేశం పై ఆరోపణలు గుప్పించారు చిరుమర్తి లింగయ్య. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం ,తాండూరు నియోజకవర్గాల్లోనూ మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేల మధ్య అసమ్మతి తీవ్రస్తాయిలో ఉంది. తాండూరు లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లోచేరారు. దీంతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గం రోహిత్ రెడ్డి వర్గం రెండు గ్రూపులుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరి పై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అధిష్టానం సైతం ఇద్దరినేతలమద్య వైరంపై ఆగ్రహంగానే ఉంది.


వచ్చే ఎన్నికల్లో తానే పోటిచేస్తానని మహేందర్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. పైలేట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా మారడంతో.. బీఆర్ఎస్ టికెట్ నాకే అనే ధీమాతో ఉన్నారు.. మహేశ్వరంలోనూ తీగల కృష్ణారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోచేరి మంత్రి అయ్యారు. ఇద్దరి మద్య గ్యాప్ పెరిగింది. ఇతరపార్టీలు సైతం తీగల ను తమపార్టీలోచేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని సమచారం. మరో నియోజకవర్గం ఉప్పల్ లో బేతి సుభాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు..అక్కడ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తానే నెక్ట్ బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటిచేస్తానంటూ ప్రచారం మొదలుపెట్టారు.. బేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మెహన్ మద్య విభేదాలు తారా స్థాయికి చేరాయు..


బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి కార్పోరేటర్ గా ఉన్నారు,.ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఎమ్మెల్యే తన డివిజన్ లో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ విమర్శలు చేయడం హాట్ టాపిక్ గామారింది.. ఉమ్మడి మహాబూబునగర్ జిల్లా కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారాపు , ప్రస్తుతం ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి మద్య సైతం ఫైట్ నడుస్తోంది.. కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం టీఆర్ఎస్ లో చేరడంతో..ఇద్దరిమద్య విబేదాలు తీవ్రతరం అయ్యాయి.. జూపల్లి నియోజకవర్గంలో సొంతగానే తన క్యాడర్ తో రాజకీయాలు నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీ మారే అవకాశాలులేకపోలేదంటున్నారు. దాదాపు పదిహేను నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లీడర్ల మద్య అసమ్మతి నెలకొంది. ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లో టికెట్ రాకపోతే .. పక్క పార్టీవైపూ చూసే వాళ్లు ఎక్కవగా ఉన్నారనేది సుస్పష్టం..


మార్గం శ్రీనివాస్ .

Tags

Read MoreRead Less
Next Story