Editorial: "ఇది నాకు... అది నీకు - క్విడ్ ప్రోకో పాలిటిక్స్

Editorial: ఇది నాకు... అది నీకు - క్విడ్ ప్రోకో పాలిటిక్స్
ఉమ్మడి నల్లగొండలో రసవత్తర రాజకీయాలు; వచ్చే ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ పెట్టిన సిట్టింగులు; ప్రత్యర్థులను పార్టీలోకి లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు; ఏకంగా ఎమ్మెల్సీ పదవినే ఎర వేస్తున్న ఎమ్మెల్యేలు; బీఆర్ఎస్ నాయకుల క్విడ్ ప్రో కో పై విమర్శలు....

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో.. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. శాసనసభ్యులంతా అభివృద్ధి పనులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో.. ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు గులాబీ ఖాతాలోనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ ఆదేశాలతో.. సొంతపార్టీలో అసమ్మతులు లేకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట ఎమ్మెల్యేలు. ఇందులోభాగంగానే.. తమ వాళ్లకు, తమ గెలుపుకు దోహదపడేవారికి.. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు, ఇతర పార్టీ పదవులు ఇప్పించుకుంటున్నారట.

ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు MLA గొంగిడి సునీత, DCCB ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు.. నియోజకవర్గంలో తమకు రాజకీయంగా ఎదురులేకుండా చేసుకోవడంలో సఫలం అయ్యారు. వీరి ప్రధాన అనుచరుల్లో ఒకరైన "లింగాల శ్రీఖర్ రెడ్డి" కి.. "నార్మూల్- మదర్ డెయిరీ ఛైర్మన్'' పదవి ఇప్పించుకున్నారు. నాగార్జునసాగర్ లో MLA నోముల భగత్.. తమ నియోజకవర్గం నాయకుడు రాంచంద్ర నాయక్ గతంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా చేయగా.. తాజాగా "గిరిజన ఆర్థిక అభివద్ది సంస్థ చైర్మన్" పదవి వరించింది. అలాగే.. తమ సామాజికవర్గం నాయకుడైన "దూదిమెట్ల బాలరాజు యాదవ్" ను తెలంగాణ రాష్ట్ర "గొర్రెలు, మేకలు అభివృధి సమాఖ్య ఛైర్మన్" గా చేసుకోవడంలో భగత్ సఫలమయ్యాడనే చెప్పాలి. ఇక.. మిర్యాలగూడ MLA నల్లమోతు భాస్కర్ రావు.. తన నియోజకవర్గంలోని కీలక నాయకుడైన మాజీ ఎమ్మెల్యే "తిప్పన విజయసింహారెడ్డి" కి.. "ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఛైర్మన్" పదవి దక్కడంలో తనవంతు పాత్ర పోషించారు. తుంగతుర్తి MLA గాదరి కిషోర్ సైతం.. తన నియోజకవర్గనేత "కంచర్ల రామకృష్ణారెడ్డికి.. "ఆయిల్ ఫెడ్ ఛైర్మన్" దక్కడంలో కీలకపాత్ర పోషించారు. ఈరకంగా.. పలువురు ఎమ్మెల్యేలు, తమ ప్రాంతంలోని ముఖ్యమైన నాయకులకు పార్టీ పదవులను.. తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

తాజాగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న "ఎలిమినేటి కృష్ణారెడ్డి" పదవీకాలం వచ్చే మార్చి నెలతో ముగుస్తుంది. దీంతో.. ఆ పదవిని తమవారికి ఇప్పించడం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పలువురు MLAలు తీవ్రంగా కృషిచేస్తున్నారట. ముఖ్యంగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. తమకు కలిసొచ్చే విధంగా సపోర్ట్ చేస్తానంటే ఎమ్మెల్సీ పదవిని ఇప్పిస్తానంటూ పలువురు ఎమ్మెల్యేలు ఏకంగా డీల్ చేసుకుంటున్నారట. కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పదవితో ఏర్పడే ఖాళీని.. భర్తీ చేసేందుకు.. ఇద్దరు ఎమ్మెల్యేలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం BRS పార్టీలో జోరుగా సాగుతోంది. వీరిలో ఆలేరు MLA గొంగిడి సునీత దంపతులు... గతంలో కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే "బూడిద భిక్షమయ్య గౌడ్" ని తీసుకొచ్చారు. ఈయన మధ్యలోనే బీజేపీలోకి వెళ్లినప్పటికీ.. ఎమ్మెల్సీ పదవి ఆఫర్ తోనే తిరిగి గులాబీ గూటికి చేరారనే టక్ వినిపిస్తోంది. ఇక.. భువనగిరి MLA ఫైళ్ల శేఖర్ రెడ్డి సైతం.. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని గులాబీ గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారట. ఏకంగా ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వీరేగాక.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం.. తమవారికి ఎమ్మెల్సీ పదవిని ఇప్పించుకోవాలని.. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లామంత్రి జగదీష్ రెడ్డిల చూట్టూరా తిరుగుతున్నారట.

ఈరకంగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఇప్పటికే పలువురు నాయకులకు కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ పదవులు ఇప్పించుకోవడంలో పలువురు ఎమ్మెల్యేలు సక్సెస్ అయ్యారు. ఇక.. ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పదవి గడువు ముగుస్తుండటంతో.. ఆ పదవిని తమ గెలుపుకు ఉపయోగపడే వారికోసం దక్కేలా పలువురు ఎమ్మెల్యేలు తీవ్రంగా శ్రమిస్తుండటం.. జిల్లా గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story