25 Jan 2023 11:21 AM GMT

Home
 / 
తెలంగాణ / Editorial: "బీజేపీలో...

Editorial: "బీజేపీలో వార్"

ముథోల్ కమలంలో కల్లోలం; రామారావు పటేల్‌ చేరికపై అసంతృప్తి; తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్లు; అధిష్టానం తీరుపై నేతల ఆగ్రహం; చర్చనీయంగా బీజేపీ రాజకీయం

Editorial: బీజేపీలో వార్
Xఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే బీజేపీకి బలమైన నియోజకవర్గంగా పేరున్న ముథోల్‌లో అసంతృప్తి జ్వాలలు ఆరంభమయ్యాయి. డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం అసంతృప్తికి ఆజ్యం పోసింది. సుదీర్ఘ కాలంగా నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తుండడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రెండేళ్ల క్రితం పార్టీలో చేరి బలోపేతం కోసం కృషి చేసిన బోస్లే మోహన్‌రావు పటేల్‌.. ఇలా అనేకమంది బీజేపీ లీడర్లు.... రామారావు పటేల్‌ చేరికను వ్యతిరేకిస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి వర్గీయులైతే రామారావు పటేల్‌ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మహిళా నేతగా నియోజకవర్గంలో రెండు పర్యాయాలు బలమైన పోటీనిచ్చి.. రెండోస్థానంలో నిలిచిన తనను కాదని కాంగ్రెస్‌ నుంచి చేరిన వ్యక్తికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారంపై ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. రామారావు పటేల్‌ చేరికతో తమ పరిస్థితి ఏంటని రమాదేవి వర్గీయులు పార్టీ అధిష్ఠానాన్ని నిలదీసేలా ఉన్నారు. స్థానిక నాయకులు కూడా విభిన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది సీనియర్లు ఈటల రాజేందర్‌తో సంబంధాలు పెంచుకోగా ఆయన నేతృత్వంలో అధిష్ఠానానికి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రామారావు పటేల్‌ను వ్యతిరేకించే వారంతా ఏకమైతే పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ పరిస్థితులను గమనిస్తున్న అధిష్ఠానం నియోజకవర్గ నేతలందరిని రామారావు పటేల్‌తో కూర్చొబెట్టి సయోధ్య కుదుర్చే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన రామారావు పటేల్‌తో వరుసకు సోదరుడైనా మోహన్‌రావు పటేల్‌ కలిసి నడుస్తారా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. మాజీఎమ్మెల్యే నారాయణ రావు పటేల్‌ తమ్ముడైన మోహన్‌రావు పటేల్‌కు ముథోల్‌ నియోజకవర్గంలో బలమైనవర్గం ఉంది. నారాయణరావు పటేల్‌ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఈ నియోజకవర్గంలో మోహన్‌ పటేల్‌ ఎంత చెబితే అంత అన్నట్లుగా ఉండేది. దీంతో ఆయన నియోజకవర్గంలోని గ్రామగ్రామాన తన అనుచరవర్గాన్ని పెంచుకున్నారు. బీజేపీలో చేరిన తరువాత పార్టీ విస్తరణ కోసం కృషి చేశారు. పార్టీ రాష్ట్ర నేతల సహకారంతో నియోజకవర్గాన్ని కలియతిరిగి అన్ని గ్రామాల్లో కేడర్‌ బలోపేతం కోసం పాటుపడ్డారు. ఇటీవల భైంసాలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ అన్ని రాజకీయ వర్గాలను ఆకర్షించింది. పార్టీకోసం ఇంత చేస్తుంటే సోదరుడైనా రామారావు పటేల్‌ను పోటీగా తీసుకురావడంపై మోహన్‌ పటేల్‌ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడంతో పార్టీ పెద్దలేవరైనా సయోధ్య కుదురుస్తారని కూడా ప్రచారం ఉంది. అది జరగని పక్షంలో మోహన్‌ పటేల్‌.... రామారావు పటేల్‌కు పూర్తిస్థాయిలో సహకరించడం అనుమానమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం ఇంతలా పోటీ నెలకొన్న వేళ ఆధిపత్యపోరు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఆశావహులందరికీ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చిందట. టిక్కెట్ కోసం పాకులాడకుండా పార్టీ బలోపేతం కోసం ఎవరిపనిలో వారు నిమగ్నం కావాలని సూచించిందట. వారివారి బాధ్యతలు ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తే వారికే టిక్కెట్ అనే ఖరాఖండిగా చెప్పేసిందట.

  • tags
Next Story