Editorial: తండ్రీకొడుకులు ప్రతీకారం తీర్చుకోగలరా?

Editorial: తండ్రీకొడుకులు ప్రతీకారం తీర్చుకోగలరా?
నాగర్ కర్నూల్ లో నయా రాజకీయం; అసంతృప్తితో రగిలిపోతున్న తండ్రీకొడుకులు; పదవి దూరం చేసిన ఎమ్మెల్యేలపై నజర్; అచ్చంపేట టార్గెట్ గా కార్యకలాపాలు; టిక్కెట్ మాదే అంటూ జోరుగా ప్రచారాలు


నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. రెండోసారి కూడా జడ్పీ ఛైర్మన్ పదవి తన తనయుడికి దక్కకపోవడంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట నాగర్న కర్నూల్ ఎంపీ రాములు. ఈయన తనయుడు భరత్ కల్వకుర్తి జడ్పీటీసీగా ఉన్నాడు. 2019లోనే భరత్ కు నాగర్ కర్నూల్ జడ్పీ ఛైర్మన్ పదవి దక్కుతుందని భావించారు. ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగింది. అనూహ్యంగా భరత్ కు కాకుండా తెల్కపల్లి జడ్పీటీసీ అయిన పద్మావతిని పదవి వరించింది. దీంతో తండ్రీకొడుకులిద్దరు అప్పటినుంచి నారాజ్ గానే ఉన్నారు. కానీ పద్మావతి ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమె జడ్పీటీసీగా అనర్హురాలని కోర్టు తీర్పు చెప్పింది. జడ్పీటీసీ పదవితో పాటు జడ్పీ ఛైర్ పర్సన్ పదవిని కూడా పోగొట్టుకున్నారు పద్మావతి. దీంతో ఖాళీ అయిన ఛైర్మన్ పదవి భర్తీలో భాగంగా సీల్డ్ కవర్ లో పేరును పంపింది బీఆర్ఎస్ అధిష్టానం. సీల్డు కవర్ లో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన శాంతకుమారిని నూతన జడ్పీ ఛైర్ పర్సన్ గా ప్రకటించింది అధిష్టానం. ఇలా తండ్రికొడుకులకు రెండోసారి ఊహించని దెబ్బ తగిలింది.

అప్పటి వరకు జడ్పీ ఛైర్మన్ పదనిపై ఆశలు పెట్టుకున్న రాములు, ఆయన తనయుడు భరత్ షాక్ గురయ్యారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. చివరకు తమ అసంతృప్తిని ప్రకటించి వెళ్లిపోయారు. ఆతర్వాత జడ్పీటీసీ పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు భరత్. ఆతర్వాత తన స్పీడ్ ను పెంచారు. ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు తండ్రీకొడుకులు. రెండు సార్లు జడ్పీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ ను అధిష్టానం బుజ్జగించిందట. అందుకే కొంత శాంతించారట తండ్రీకొడుకులు. కానీ.. రెండు సార్లు తమకు జడ్పీ పదవి రాకుండా అడ్డుకున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఇప్పటికీ కోపంగానే ఉన్నారట. అందుకే వారిని ఢీకొట్టేలా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారట.

తండ్రీకొడుకులు అచ్చంపేట టార్గెట్ గా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రానున్న ఎన్నికల్లో అచ్చంపేట నుంచి తండ్రీ లేదా కొడుకు బరిలోకి దిగేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. ఇందులో భాగంగా ఎక్కువ సమయాన్ని అచ్చంపేట నియోజకవర్గంలో గడుపుతున్నారట. అచ్చంపేటలో ఉన్న ముఖ్య అనుచరులు, మిత్రులు, బంధుగణాన్ని ఏకం చేస్తున్నారట ఎంపీ రాములు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన అనుచరులను, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై అసంతృప్తితో ఉన్న వారందరిని కలుపుకుంటున్నారు. రోజూ ఏదో ఓచోట చిన్నచిన్న సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇతర పార్టీల్లో ఉంటూ తనకు సానుభూతి పరులుగా ఉన్న వారితోనూ టచ్ లో ఉన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని తమ సన్నీహితులు ఆపదలో ఉన్నా లేదా ఆసుపత్రుల పాలైనా వెంటనే స్పందించి వారి వద్దకు వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. ఇక శుభాకార్యాల్లోనూ అంతే ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ప్రస్తుతం ఎన్నికల్లోనే ఉన్నామా అన్నట్లు ఇటు ఎంపీ రాములు అటు భరత్ ఇద్దరు కూడా జనంలోకి విస్తృతంగా వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో బరిలోకి దిగాలనే ఉద్దేశంతో రంగం సిద్ధం చేసుకుంటున్నారని గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. త్వరలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తమకే టిక్కెట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారట. ఒక వేళ బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ దక్కక పోయినా.. బరిలో నిల్చోవడం ఖాయమనే సంకేతాలిస్తున్నారట అయ్యాకొడుకులు. ఇదంతా చూస్తుంటే అచ్చంపేట రాజకీయాల్లో పెను మార్పులు తప్పవనిపిస్తోంది. నాగర్ కర్నూల్ రాజకీయాలను బీఆర్ఎస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోందట. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఎంపీ రాములు, ఆయన తనయుడు భరత్ ను బీఆర్ఎస్ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story