Editorial: నల్లగొండ ఎమ్మెల్యే కంచర్లకు "కౌంట్ డౌన్"

Editorial: నల్లగొండ ఎమ్మెల్యే కంచర్లకు కౌంట్ డౌన్
నల్లగొండ గులాబీ పార్టీలో గ్రూపులు; ఎమ్మెల్యేపై సీనియర్లలో తీవ్ర వ్యతిరేకతలు; సిట్టింగ్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు; వచ్చేఎన్నికల్లో బరిలోకి దిగేలా వ్యూహాలు; ఇదే అదునుగా రంగంలోకి యువ నేతలు

"నల్లగొండ" అసెంబ్లీ సెగ్మెంట్ లో అధికారపార్టీ ఆధిపత్యపోరు అగ్గి రాజేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎవరికి వారు.. సై అంటే సై అనడంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న సీనియర్ నాయకులంతా.. తిరిగి తమ "అస్తిత్వం" కోసం ప్రయత్నాలు ప్రారంభించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గత ఎన్నికల సమయంలోనే నల్లగొండ టిక్కెట్ కోసం దుబ్బాక నర్సింహ్మారెడ్డి, చాడ కిషన్ రెడ్డి, బండా నరేందర్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్ వంటి నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరికి పలు సర్వేలు చేయించిన CM KCR.. అప్పటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఢీకొట్టే నాయకుడు టీడీపీలో ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి అని భావించారు. గులాబీ పార్టీలోకి ఆహ్వానించడం, TRS టిక్కెట్ మీద పోటీ చేయించడం.. ఆయన గెలవడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి. సీన్ కట్ చేస్తే.. అప్పట్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డ వారిలో దుబ్బాక నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోగా.. మిగతా నాయకులు గంపెడాశలతో గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నారు.

ముందస్తు ఎన్నికలనే ప్రచారం నేపథ్యంలో.. నల్లగొండ నియోజకవర్గ అధికారపార్టీలో ఆశావాహులు మళ్లీ తెరమీదకు వస్తున్నారట. ఎన్జీవోల పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ... ఫ్లెక్సీలు, బ్యానర్లు, ర్యాలీలు, పరామర్శలంటూ హడావుడి చేస్తున్నారట. నిత్యం జనాల్లో ఉండేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. ఓవైపు సీఎం కేసీఆర్ BRS పేరుతో జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సమయంలో.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి.. ప్రాధాన్యం దక్కనివారంతా ఏకతాటిపైకి వస్తుండటం అగ్ర నాయకత్వాన్ని కలవరపెడ్తోందట.

తాజాగా.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన "చకిలం అనిల్ కుమార్" నేతృత్వంలో.. "తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం" నల్లగొండలో జరిగింది. నాడు ఉద్యమంలో లాఠీదెబ్బలు తిని, జెళ్లపాలైన వారిలో.. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు రాకుండా ఉన్నవారంతా హాజరయ్యారు. దశాబ్దంన్నర పాటు ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకొని కేసుల పాలైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించలేదని సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ వర్గం వాపోతోంది. పైగా రెండు ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారంటూ భగ్గుమంటోంది. అందుకే రాబోయే అసెంబ్లీ అన్నికల్లో బరిలో దిగడం ఖాయమంటూ.. గులాబీ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు పంపే ప్రయత్నం చేస్తున్నారట చకిలం వర్గీయులు.

అధికారపార్టీలో అలజడులు సృష్టిస్తున్న మరోనేత BRS పార్టీ కార్యదర్శి "చాడ కిషన్ రెడ్డి". 2001 నుంచి పార్టీలో కొనసాగుతూ.. రాష్ట్ర కార్యదర్శి పదవిస్థాయి వరకు ఎదిగారు. కొన్నేళ్లుగా తెలంగాణ ఉద్యమకారులకు కష్ట సమయాల్లో ఆర్థికంగా చేయూతనిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ టార్గెట్ గా యాక్టివిటీస్ పెంచారు చాడ కిషన్ రెడ్డి. తాజాగా చాడ జన్మదిన సందర్భంగా.. నల్లగొండ టౌన్ సహా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున పోస్టర్లు వేశారు. అయితే.. సడెన్ గా.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో.. చాడ కిషన్ రెడ్డి పోస్టర్ల మీద ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ కు సంబంధించిన వాల్ పోస్టర్లు వెలిశాయి. తమ నాయకుడికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే వర్గం కుట్రలు చేస్తోందని చాడ కిషన్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే కంచర్ల వర్గం మాత్రం.. ఇలా దిగజారి.. చీప్ ట్రిక్స్ చేసే మనస్తత్వం తమది కాదని.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేస్తే దోషులెవరో తెలుస్తారంటూ కౌంటర్ ఇస్తోంది.

ఇదిలావుంటే.. శాసనండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు "గుత్తా అమిత్ రెడ్డి" సైతం.. 'గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్' పేరుతో సామాజిక, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో.. టిక్కెట్ టార్గెట్ గా.. తన కొడుకు గుత్తా అమిత్ ను పక్కా ప్లాన్ తో రంగంలోకి దింపారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మరో యువనేత, BRS నల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ "పిల్లి రామరాజు యాదవ్"... ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో వచ్చిన విభేదాలతో.. వచ్చే ఎన్నికల్లో టిక్కెటే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. "RKS పౌండేషన్" పేరుతో.. పేద, బీద కుటుంబాల్లో అనారోగ్యం, ప్రమాదంతో చనిపోయినవారికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈరకంగా గుత్తా అమిత్, పిల్లి రామరాజు వంటి యంగ్ లీడర్లు.. సామాజిక, సేవా కార్యక్రమాలతో నిత్యం జనాల్లో నానుతున్నారు. రోజురోజుకు యాక్టివిటీస్ పెంచుతూ దూసుకెళ్తున్నారు.

ఈరకంగా.. నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. "MLA కంచర్ల భూపాల్ రెడ్డి" టార్గెట్ గా.. పాత, కొత్త నేతలు పావులు కదుపుతుడటం.. ఆ పార్టీ నాయకలు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. నియోజకవర్గ సీనియర్ నాయకులైన "చకిలం అనిల్ కుమార్", "చాడ కిషన్ రెడ్డి" లకు.. పార్టీ అధిష్టానం తగిన గుర్తింపుతోపాటు, నామినేటెడ్ పోస్టుల ఇస్తామంటూ హామీనిచ్చి, మాట మార్చిందని.. వారి అనుచరులు గుర్రుగా ఉ్ననారట. మరోవైపు.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయమని "గుత్తా అమిత్ రెడ్డి" భావిస్తుండగా.... ఎమ్మెల్యే కంచర్లతో ఉన్న విభేదాలతో "పిల్లి రామరాజు" తిరుగుతుండటం చర్చనీయాంశమైంది. ఏదేమైనా.. నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. గ్రూపు తగాదాలు ఎవరి కొంప ముంచుతాయోనంటూ సగటు కార్యకర్త తెగ చర్చిస్తున్నారట.

Read MoreRead Less
Next Story