Editorial: తెలంగాణపై "బీజేపీ కొత్త వ్యూహం" ఫలిస్తుందా?

Editorial: తెలంగాణపై బీజేపీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?
తెలంగాణపై బీజేపీ కొత్త వ్యూహం; క్యాడర్, లీడర్ ఖాళీ ఉండకుండా కార్యాచరణ; సభలు, సమావేశాలతో ఏడాదంతా టైట్ షెడ్యూల్; మోదీ, అమిత్ షాలతో భారీ సభలకు ప్రణాళికలు; పార్టీ పటిష్టం, సమస్యలపై పోరు ఉధృతం

ఈ ఏడాది పూర్తిగా బిజీ షెడ్యూల్ ను పెట్టుకుంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. ఇప్పటికే రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తు బిజీగా ఉన్న నేతలు వాటికి మరిన్ని షెడ్యూల్ లను యాడ్ చేస్తున్నారట. ఈ ఏడాది పూర్తిగా పార్టీ కోసం సమయం ఇవ్వాలంటూ ఇప్పటికే పాదయాత్రలో కార్యకర్తలకు చెబుతూ వచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నారట బీజేపీ నేతలు. జాతీయ నాయకత్వం ఆదేశాలతో విస్తృత కార్యాచరణ అమలుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ప్రజాగోసా.. బీజేపీ భరోసా, ప్రజాసంగ్రామ యాత్ర, జనం సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ.. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిందట.

ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే అన్ని రాష్ట్రాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట బీజేపీ తెలంగాణ నేతలు. ఇప్పటికే జాతీయ కార్యవర్గ సమావేశాలకు కొనసాగింపుగా నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తోడుగా మరిన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసిందట బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ప్రస్తుత ఫోర్సతో వెళ్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామా అన్న అనుమానాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరింత దూకుడు పెంచాలన్న నిర్ణయానికి వచ్చిందట బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నాయకులతో సుడిగాలి పర్యటనలు చేపట్టేలా నిర్ణయించారట నేతలు. ఉమ్మడి పది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది కాలంలో 13కు పైగా బహిరంగ సభలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. ఈ ఐదు నెలల్లో 10బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోందట. ఈ సభలకు మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యానాథ్, ఫడ్నవీస్ వంటి జాతీయస్థాయి నాయకులను అతిథులుగా పిలిచేందుకు ప్లాన్ చేస్తున్నారట. వీరితో ఉమ్మడి జిల్లాకో సభ ఏర్పాటు చేసి... క్యాడర్ కు దిశానిర్దేశం చేయడమే లక్యంగా పెట్టుకున్నారట బీజేపీ రాష్ట్ర నేతలు.

ఈ సభలకు బూత్ కమిటీ సభ్యులను హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే టార్గెట్ గా పెట్టుకున్న బూత్, శక్తీ కేంద్రాలు, మండల కమిటీలను పూర్తి చేయలని జిల్లా నేతలకు టార్గెట్ ఇచ్చిందట రాష్ట్ర నాయకత్వం. వచ్చే రెండు నెలల్లో ఈ కమిటీలను పూర్తి చేస్తే జిల్లాకు లక్షమంది క్యాడర్ తయారవుతుందని.. వారందరినీ సభలకు తరలిస్తే సభలు సునాయాసంగా విజయవంతం చేసుకోవచ్చనే భావనలో ఉన్నారట. అటు జాతీయ నేతలు నేరుగా వచ్చి చెబితే క్యాడర్ మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట. మరో నాలుగైదు నెలల పాటు ఊపిరి సలపని కార్యక్రమాలు నిర్వహిచడం ద్వారా ఎన్నికల సమయం నాటికి క్యాడర్ యాక్టీవ్ కావడమే కాకుండా ఉత్సాహంగా పనిచేసేందుకు అలవాటు పడిపోతారని అనుకుంటున్నారు. పార్టీ ఎన్నికల ముందు ఇచ్చే ఏ కార్యాచరణ అయినా పగడ్బంధీగా అమలు చేసే అవకాశం ఉందన్న భావనలో ఉన్నారట బీజేపీ రాష్ట్ర నేతలు. మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనుకున్న మేరకు ఎన్నికల నాటికి క్యాడర్ ను యాక్టీవ్ చేయాలన్న యోచన ఏ మేరకు సత్ఫలితాన్నిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story