Editorial: పాలమూరు నుంచి ప్రధాని పోటీ..!

Editorial: పాలమూరు నుంచి ప్రధాని పోటీ..!
ఆసక్తికరంగా ఉమ్మడి పాలమూరు రాజకీయం; జిల్లాపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్; పాలమూరుపై పట్టు బిగించేందుకు ఆరాటం; మోదీ బాణాన్ని ప్రయోగించిన అధిష్టానం; పాలమూరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గులాబీమయంగా ఉన్న ప్రాంతాన్ని కాషాయ శోభితం చేయాలని నడుం బిగించిందట బీజేపీ. ఇపుడున్న 14 నియోజకవర్గాల్లో మూడునాలుగు నియోజకవర్గాల్లో మినహా బీజేపీ ప్రాబల్యం లేదు. కానీ ఏకంగా 14 నియోజకవర్గాల్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందట. అందుకు ప్రచార అస్త్రంగా మోదీ పాలమూరు పార్లమెంటు నుంచి రంగంలోకి దిగబోతున్నాడనే చర్చ మొదలుపెట్టింది. తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ... పాలమూరులో పట్టు బిగిస్తే తప్ప అధికారంలోకి రాలేమనే నిర్ణయానికి కేంద్ర నాయకత్వం వచ్చిందట. ఇక్కడి నాయకులు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలకు ఇప్పటికే జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు ఇచ్చారు. వీరి ద్వారా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై అధిష్టానమే నేరుగా రంగంలోకి దిగిందట. ఈ నేపథ్యంలోనే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తానే ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.

ప్రచారానికి బలం చేకూర్చేలా మొన్న జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాజీఎంపీ జితేందర్ రెడ్డి ప్రధానిని కలిసి పాలమూరు నుంచి పోటీ చేయాలని విన్నవించారు. దీంతో పాలమూరు ఉమ్మడి జిల్లాపై బీజేపీ నజర్ పెరిగింది అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు.. ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలోనే రాబోయే రోజుల్లో ఏం చేయాలనే దానిపై నిర్ణయించుకోవాలన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నేరుగా చేపట్టే మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయించుకునేందుకు, ప్రధానికి విన్నవించేందుకు స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు. మహబూబ్ నగర్, సికింద్రాబాద్ మార్గంలో 85 కిలోమీటర్ల మేర పూర్తయిన రైల్వే డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ఎంఎంటీఎస్ రైలు నడపాలనే డిమాండ్ తాజాగా తెరమీదకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారట.

ఈ నేపథ్యంలో వచ్చే 24న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించేందుకు పూనుకున్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైన రాజకీయ కార్యాచరణతో పాటు కేంద్రం నుంచి నేరుగా అమలు చేసే ప్రాజెక్టులపై నాయకులు సమావేశంలో మాట్లాడనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పాగా వేసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాల్ని బీజేపీ తెరమీదకు తెస్తోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story