Editorial: ఉమ్మడి ఆదిలాబాద్ లో సగం మంది ఎమ్మెల్యేలు ఔట్..?

Editorial: ఉమ్మడి ఆదిలాబాద్ లో సగం మంది ఎమ్మెల్యేలు ఔట్..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్; గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ గుబులు; పనితీరు బాలేని ఎమ్మెల్యేల పని ఔట్! సగం మంది సీటు గల్లంతనే ప్రచారం; ఆశావహుల్లో ఉత్సాహం, సిట్టింగుల్లో టెన్షన్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారే కావడం విశేషం. ఇందులో ఓ మంత్రి కూడా ఉన్నారు. ఐదు జనరల్ సీట్లు ఉండగా.. మరో ఐదు రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. ఇందులో మూడు ఎస్టీ, రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. సిట్టింగులకే టిక్కెట్ అని గులాబీ బాస్ హామీ ఇచ్చినా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. 10 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా సగం మందిని మారుస్తారనే చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగు రామన్న 2009 నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. 2012లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న జోగు రామన్న వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఆదిలాబాద్ లో ఈయనకు పోటీ పెదగాలేనట్టే. నియోజకవర్గంలో చురుకైన నాయకుడిగా పేరుండటంతో ఒకరిద్దరు ఆశావాహులు ఉన్నప్పటికీ జోగు రామన్నకి మరోసారి టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఈసారి టికెట్ కష్టంగా మారింది. పనితీరుతో పాటు వివాదాలు బాపురావుని చుట్టుముడుతున్నాయి. ఓ రియల్టర్ తో బాపురావు ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు, అంతర్గత వర్గ విభేదాలతో ఈసారి టిక్కెట్ డౌట్ అనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీమంత్రి గోడం నగేష్, అనిల్ జాదవ్ లు బోథ్ టికెట్ ని ఆశిస్తున్నారు.

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎలాంటి పోటీ లేదు. ఉమ్మడి జిల్లాలో చాలా సీనియర్ అయిన ఐకే రెడ్డి.. 2014లో బీఎస్పీ నుండి గెలిచి బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. 2018 లో గెలిచి మరోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. పనితీరులో పరవాలేదని కొందరు, బాగాలేదని కొందరు చెబుతున్నప్పటికీ టిక్కెట్ మాత్రం మంత్రినే వరించే అవకాశం ఉంది. వయసు రీత్యా వేరే గౌరవప్రదమైన పదవిని కట్టబెట్టి.. మరో మంచినేతను తెరపైకి తీసుకురావాలని పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మొదటగా కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో వారికి, ఆ పార్టీకే తెలియాలి.

ముధోల్ లో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విట్టల్ రెడ్డికి టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. ఈయన 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. రెండోసారి అవకాశం దక్కడంతో మళ్లీ గెలిచాడు. వివాద రహితుడు, సౌమ్యుడు కావడంతో మళ్లీ అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. భైంసాలో వర్గాల ఘర్షణల నేపథ్యంలో కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ.. పార్టీలో మంచి పలుకుబడి ఉండడంతో టికెట్ ఖాయంగానే కనిపిస్తోంది. ఎస్టీ రిజర్వుడ్ అయినా ఖానాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పనితీరు అంతంత మాత్రమేనని టాక్. 2014 , 18 లో వరుసగా గెలిచి మంత్రి పదవి ఆశించిన రేఖా నాయక్ కు నిరాశే ఎదురైంది. మరోసారి టికెట్ పొంది, విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశతో ఉన్నారు. కాగా పార్టీలో సిట్టింగ్ పై చాలామంది నేతలు అసంతృప్తి తో ఉన్నట్టు టాక్. ఇక ఈమెకు పోటీగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, గ్రీన్ ఇండియా చాలెంజ్ డైరెక్టర్ పూర్ణచందర్ లు ఉన్నారు. మరి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.

మంచిర్యాల నియోజకవర్గంలో దివాకర్ రావు 2014లో పార్టీలో చేరి టికెట్ పొంది విజయం సాధించాడు. 2018లో మళ్లీ గెలిచాడు. కానీ నియోజకవర్గంలో ఈయన పనితీరు ఏం బాలేదని టాక్. కొన్ని ఆరోపణలతో దివాకర్ రావుకి టిక్కెట్ కష్టమనే ప్రచారం జరుగుతోంది. పార్టీ సర్వే లో పాజిటివ్ వస్తే టికెట్ దక్కవచ్చు లేదంటే కష్టమే. ఇక మాజీఎమ్మెల్యే అరవిందరెడ్డి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. చెన్నూరులో బాల్క సుమన్ కు సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీలో ఉన్నప్పటికీ పోటీకి రాకపోవచ్చు. కచ్చితంగా టికెట్ సుమన్ కి వరిస్తుందని టాక్. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని ఆరోపణలు చిన్నయ్యపై ఉన్నాయి. అవి టికెట్ పై ప్రభావితం చూపొచ్చు. బీఆర్ఎస్ సర్వేలో గెలుస్తాడనుకుంటేనే టికెట్ వరించే అవకాశం ఉంది లేదంటే కష్టమే. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్... దుర్గం చిన్నయ్యకు పోటీగా ఉన్నాడు.

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇతనిది. గెలిచిన తర్వాత కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ లో చేరాడు. ప్రస్తుతం ఈయనకు పోటీగా జడ్పీ ఛైర్ పర్సన్ కోవా లక్ష్మి పోటీలో ఉన్నారు. వీరిద్దరి వర్గాల మధ్య టికెట్ పోరు చాలా రోజులగా నడుస్తోంది. పనితీరు ఆధారంగా, సర్వే ఆధారంగా ఇద్దరిలో ఒకరికి టికెట్ వరించే అవకాశం ఉంది. కచ్చితంగా టిక్కెట్ లభిస్తుంది అని అయితే చెప్పలేని పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొదటి నియోజకవర్గం అయిన సిర్పూర్లో కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో బీఎస్పీ నుండి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. 2018లోనూ గెలుపొందారు. కోనప్ప చేస్తున్న సేవా కార్యక్రమాలతో అధిష్టానం వద్ద మంచి పేరుంది. దీంతో టిక్కెట్ రెస్ లో అతనికి దరిదాపులో ఎవరు లేరని చెప్పవచ్చు.

సిట్టింగులకే టిక్కెట్ అని గులాబీ బాస్ భరోసా ఇచ్చినప్పటికీ... ఎన్నికల నాటికి వ్యూహం మార్చబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగం మంది ఎమ్మెల్యేలు ఔట్ అనే ప్రచారం తీవ్ర చర్చనీయాంశమైంది. చూడాలి మరి సార్వత్రిక సమరం నాటికి సీన్ ఎలా మారుతుందో.

Tags

Read MoreRead Less
Next Story