Editorial: "కోమటిరెడ్డి కోవర్టు అంటూ పోస్టర్లు... ఎవరి పని?"

Editorial: కోమటిరెడ్డి కోవర్టు అంటూ పోస్టర్లు... ఎవరి పని?
కాంగ్రెస్ పార్టీలో మరో బ్లాస్ట్; నల్లగొండ వేదికగా పోస్టర్ల కలకలం; కోవర్టు కోమటిరెడ్డి అంటూ వాల్ పోస్టర్లు; సొంత కార్యకర్తల పనా, ప్రత్యర్థి పార్టీలదా? క్యాడర్లో, లీడర్లలో అనేక అనుమానాలు....

నల్లగొండ జిల్లా రాజకీయాల్లో MLA, మంత్రిగా పనిచేసిన.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ప్రతిపక్షాలపైనే కాదు, సొంతపార్టీపైనా విమర్శలు చేయడంలో ఈయన ఎక్స్ పర్ట్. సారు ఏం మాట్లాడినా సంచలనమే. మొన్నటివరకు పార్టీ ప్రెసిడెంట్ ని, ఇన్ ఛార్జ్ ని తిట్టిపోసిన కోమటిరెడ్డి.. కొత్త జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్ ఛార్జ్ రాకతో దూకుడు తగ్గించారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే గాంధీ భవన్ కు వెళ్లి కొత్త పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తో సమావేశమయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డితోనూ మాటలు కలిపారు. ఇదంతా క్యాడర్ లో జోష్ నింపిందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ఎంపీ కోమటిరెడ్డి.. కోవర్ట్ అంటూ జిల్లాలో వెలిసిన వాల్ పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో చందనపల్లి సమీపంలోని బ్రిడ్జి గోడలపై.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా రాత్రికిరాత్రే వాల్ పోస్టర్లు వెలిశాయి. "కోవర్ట్ వెంకట్ రెడ్డి.. ఇది నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన" అంటూ పోస్టర్లలో ఉంది. ఇందులో ఎంపీకి 13 ప్రశ్నలు సంధించారు. ఇవి ఇప్పుడు కాంగ్రెస్‌లో నే కాదు.. నల్లగొండ రాజకీయాల్లో, తెలంగాణ కాంగ్రెస్ లోనూ హాట్‌ టాపిక్‌గా మారాయి. పార్టీలో ఉంటూ పార్టీకే ద్రోహం చేస్తున్నా.. అధిష్టానం పట్టించుకోవడం లేదని.. మునుగోడు ఉపఎన్నికలో తమ్ముడి గెలుపు కోసం బీజేపీకి సపోర్ట్ చేశావు. బీసీ నాయకులను ఎదగనీయకుండా తొక్కిపెట్టిన నీలాంటి వాళ్లను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలి. సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతుంటే ఆపలేకపోయావు, అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి టిక్కెట్ ఇప్పించిన చిరుమర్తి లింగయ్య పార్టీ వీడుతుంటే అడ్డుకోలేకపోయవు. సొంత కుటుంబసభ్యులను గెలిపించుకోలేని నువ్వు.. స్టార్ క్యాంపెయినర్ ఎలా అవుతావు..? అంటూ వాల్ పోస్టర్ లో నిలదీశారు.

గతంలో బీసీ వర్గానికి చెందిన స్వామిగౌడ్, మల్లేష్‌గౌడ్, బిక్షమయ్యగౌడ్‌లను అనేక ఇబ్బందులకు గురిచేసి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసింది నువ్వు కాదా?. నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందుకు లేదు?. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఎందుకు నిలబెట్టలేదు..?. సొంత సోదరుల్ని జడ్పీటీసీగా గెలిపించుకోలేని అసమర్థుడివి నువ్వు.. సొంత గ్రామమైన బ్రహ్మణవెల్లంలో సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపించుకోలేని చేతగాని వాడివంటూ ఏకిపారేశారు. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కడుదుల నగేష్ ఎమ్మెల్సీగా ఉంటానంటే ఎందుకు మద్దతు ఇవ్వలేదు..?. నకిరేకల్ నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డిజిటల్ సభ్యత్వాలు ఎన్ని చేయించారు?. నకిరేకల్ నియోజకవర్గంలో నువ్వు నియమించిన మండల పార్టీ అధ్యక్షులు.. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరఫున ప్రచారం చేసినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు..? వీటన్నింటికీ కారణం ఎవరు..? 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ మెంబర్‌షిప్‌లో అసలు నీకు సభ్యత్వం ఉందా..?' అని పోస్టర్లలో కడిగిపారేశారు.

మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయాలపై కోవర్టు ఆరోపణలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. అవే.. బీజేపీ తరఫున పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడానికి పరోక్షంగా దోహదపడ్డాయనేది కమలం పార్టీ నాయకుల వాదన. రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్ లు సైతం ఈ ఆరోపణలు మునుగోడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇప్పుడు అవే ఆరోపణలతో మళ్లీ పోస్టర్లు వెలవడం నల్లగొండ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి.

మునుగోడు ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు దూరమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తెలంగాణ ఇన్‌ఛార్జ్ గా 'మాణిక్‌రావు ఠాక్రే' బాధ్యతలు చేపట్టాక మళ్లీ పార్టీ గళం ఎత్తుతున్నారు. అప్పట్లో అసలు గాంధీ భవన్ మెట్లు ఎక్కనంటూ నాగమ్మ శపథం చేసినా.. ఇటీవలే గాంధీ భవన్‌కు వచ్చారు. పైగా తానెప్పుడు గాందీభవన్ కు రానని అనలేదంటూ ప్లేటు ఫిరాయించారు. ఇక.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో ముచ్చటించడం.. నల్లగొండలోని కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ లలో.. ఇంతకాలం కనిపించని రేవంత్ ఫోటో సడెన్ గా దర్శనమివ్వడంతో క్యాడర్ సైతం అవాక్కైందట.

కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను అనే నమ్మకం కలిగేలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కోవర్టు కోమటిరెడ్డి వాల్ పోస్టర్లు క్యాడర్లో కలకలం రేపాయి. ఇది కాంగ్రెస్‌ కార్యకర్త పనా..? లేదంటే బీఆర్‌ఎస్‌ నేతలు కావాలని ఇలా వేయించారా..? అన్న అనుమానాలు శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా మూడు నెలల తర్వాత ఎంపీ వెంకటరెడ్డిపై.. మళ్లీ కోవర్టు పోస్టర్లు వేయడం ఇటు కాంగ్రెస్‌ను, అటు కోమటిరెడ్డి అనుచరులను కలవరపెడుతోందట. కొత్త ఇన్ ఛార్జ్ రాకతో నాయకులంతా ఒక్కటయ్యారని కార్యకర్తలు సంతోషపడుతున్న సమయంలో.. కాంగ్రెస్ లో గొడవలు అంత ఈజీగా సమసిపోవన్న నిజం బయటికి వచ్చింది. మొన్నటివరకు దుమ్మెత్తిపోసుకున్న నాయకులు... నిన్న చేతిలో చేయివేసుకొని ఆలింగనాలు చేసుకొని మేమంతా ఒక్కటే అని గాంధీభవన్ లో ప్రదర్శించిన దృశ్యాలు ఓవైపు. నాయకుల మీద ఆరోపణలతో వీధుల్లో గోడలకెక్కిన పోస్టర్లు మరోవైపు చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డితో సహా, సీనియర్లందరినీ కలుపుకపోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వాల్ పోస్టర్లు కోమటి రెడ్డికే కాదు, రేవంత్ కు సైతం ఇబ్బందులు తేస్తాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. చూడాలి మరి కోవర్టు పోస్టర్ల ఎపిసోడ్ ఏ మలుపు తీసుకోబోతోందో.

Tags

Read MoreRead Less
Next Story