Editorial: ఆ ఇద్దరికి మళ్లీ ఎమ్మెల్సీ ఛాన్స్ లేనట్లే..?

Editorial: ఆ ఇద్దరికి మళ్లీ ఎమ్మెల్సీ ఛాన్స్ లేనట్లే..?
నిజామాబాద్ జిల్లా నేతల్లో పదవుల టెన్షన్; హ్యాట్రిక్ కోసం ఒకరు, నాలుగోసారికి మరొకరు; ఈసారి కష్టమే అని చెబుతున్న అధిష్టానం; పదవికోసం మిగతా నేతల పోటాపోటీ; ఐనా వేచి చోసే ధోరణిలో ఆ ఇద్దరు....

నిజామాబాద్ జిల్లా కు చెందిన ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్ ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వీజీ గౌడ్ పదవీ కాలం మార్చి 30న ముగియనుండగా.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఉన్న రాజేశ్వర్ పదవీ కాలం మే 27న పూర్తవుతుంది. ఐతే ఈ ఇద్దరు నేతలు మరోసారి అవకాశం కల్పించాలని అధిష్ఠానానికి అర్జీ పెట్టుకున్నారట. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉంటూ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని వరుసగా రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యారు వీజీ గౌడ్. ముచ్చటగా మూడో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సదరు ఎమ్మెల్సీకి అవకాశం లేనట్లే అని చెప్పకనే చెప్పేశారట పార్టీ పెద్దలు.

దివంగత నేత వైఎస్ అనుచరునిగా ఉన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ 2007లో మొదటిసారి ఎమ్మెల్సీ అయ్యారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ సహకారంతో 2011లో రెండోసారి, 2017లో సీఎం కేసీఆర్ అండతో మూడోసారి ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. మే లో పదవీకాలం ముగియనుండటంతో మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారట. నాలుగోసారి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కోసం గట్టిగానే పైరవీ చేస్తున్నారట. ఈయనకు కూడా వీజీ గౌడ్ కు వచ్చిన సమాధానమే వచ్చిందట. దీంతో ఎలాగైనా మరోసారి ఛాన్స్ పట్టేయాలని ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట.

ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్ లు వివాద రహితులుగా జిల్లాలో కొనసాగుతున్నారు. ఏ నియోజకవర్గంలో వేలు పెట్టకుండా తమపని తాము చేసుకుపోతున్నారట. గౌడ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వీజీ గౌడ్ తనకు మరోసారి అవకాశం వస్తుందని ఆశాభావంతో ఉన్నారట. ఇటు రాజేశ్వర్ సైతం కేవీపీతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో గులాబీ బాస్ కు చెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ రెన్యూవల్ కాకుంటే.. జుక్కల్ అసెంబ్లీ స్థానం కోసం తన పేరు పరిశీలన చేయాలంటూ రాజేశ్వర్ అర్జీ పెట్టుకున్నారట. ఐతే అక్కడ సిట్టింగ్ ను కాదని కొత్త ప్రయోగం చేస్తే మొదటికే నష్టం వస్తుందని సర్వే నివేదికల్లో తేలిందట. దీంతో ఈసారికి వదిలేయండి మళ్లీ చూద్దాం అంటూ గులాబీ పెద్దల నుంచి సమాధానం వస్తోందట.

రెన్యూవల్ చేస్తారని, నిరీక్షణ ఫలిస్తుందని గంపెడాశలతో ఉన్న సదరు నేతలు.. ఏమో చివరి నిమిషంలో ఏమైనా జరుగొచ్చు అంటూ క్యాడర్ కు భరోసా కల్పిస్తున్నారట. ఇప్పటికే ఆ ఎమ్మెల్సీ పోస్టు కోసం డజన్ల సంఖ్యలో నేతలు అధినేతకు దరఖాస్తులు చేసుకున్నారట. ఈ దఫా జిల్లా నేతలకు కాకుండా ఇతర జిల్లాల నేతలను ఆ పదవుల్లో భర్తీ చేయాలని గులాబీ బాస్ లిస్టు రెడీ చేస్తున్నారనే టాక్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఒకరు హ్యాట్రిక్ కోసం.. మరోకరు నాలుగోసారి ఎమ్మెల్సీ పదవీ కోసం రెన్యూవల్ కోసం మొక్కని దేవుళ్లు.. ఎక్కని మెట్లు లేవట. కానీ పోటీ ఎక్కువగా ఉండటంతో మరో ఛాన్స్ లేనట్లేనని టాక్ వినిపిస్తుండటం ఆ నేతల్లో గుబులు రేపుతోందట. ఐతే గులాబీ బాస్ నిర్ణయం చివరి క్షణంలో ఏమైనా మారుతుందా లక్కీ ఛాన్స్ తగులుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story