Editorial: " సీఎం కేసీఆర్ ట్రాప్ లో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..? "

Editorial:  సీఎం కేసీఆర్ ట్రాప్ లో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..?
కొత్తచర్చకు దారితీసిన తెలంగాణ అసెంబ్లీ; బీజేపీ, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన సీఎం కేసీఆర్ ; మోదీని తిడుతున్నా అడ్డుచెప్పని బీజేపీ ఎమ్మెల్యేలు; ఈటల తమవాడంటూ డిఫెన్స్ లో పడేసిన బీఆర్ఎస్..



తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసినా... అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు ఇంకా బీజేపీని, కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉన్నాయట. అసెంబ్లీసమావేశాలు జరిగిన తీరు కొత్త చర్చకు తెరలేపాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కురిపించిన ప్రేమ.. పలు అనుమానాలకు దారి తీసింది. బయట కేసీఆర్ పై ఒంటి కాలుపై లేస్తున్న రేవంత్, బండి సంజయ్ లకు... సభలో జరిగిన పరిణామాలు ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయంటున్నారు. ఎన్నికల ఏడాది బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాల్సిందిపోయి.... చర్చమొత్తం మోదీ, కేంద్రప్రభుత్వం వైపు తీసుకెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షపార్టీలు విమర్శలకు తావులేకుండా చేశాయన్న టాక్ నడుస్తోంది. పార్టీ మారిన ఈటల రాజేందర్ సమక్షంలోనే... ఆయన్నే సాక్షిగా చూపెడుతూ కేంద్రం, మోదీపై విమర్శలు చేయడంలో.. అటు సీఎం, ఇటు మంత్రులు కేటీఆర్, హరీష్ సక్సెస్ అయ్యారు. తన పేరును పదేపదే ప్రస్తావించడంతో ఈటల డిఫెన్స్ లో పడిపోయారన్నది వాస్తవం. ఇదే ఇప్పడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ బడ్జెట్ సమావేశాలు జరిగే తీరుపై మొదటి నుండి ఆసక్తికర పరిణామాలే జరుగుతున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగంపై వివాదం రేగగా.. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతిస్తారా లేదా అన్నదానిపై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. సభలోకి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చినా వెంటనే సస్పెండ్ అయిపోతారన్న చర్చ సాగింది. అయితే అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు సెషన్ మొత్తం సభలో కొనసాగారు. ప్రభుత్వం వైపు నుండి కూడా అలాంటి సంకేతాలేవీ లేవు. గత అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి సభకు రానివ్వకుండా అధికార పక్షం కుట్రచేసిందని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఆపార్టీ నేతలు. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది అనుకున్నా సీన్ మొత్తం రివర్స్ అయింది.

కనీసం తన మొహం చూసేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం లేదని.. అందుకే తనను ఓడించేందుకు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారని ఈటల రాజేందర్ ఆరోపిస్తూ వచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలిచినప్పటినుంచి ఇంతరవరకు ఈటల రాజేందర్ కు సభలో మాట్లాడే అవకాశం రాలేదు. గత రెండు సమావేశాల్లోనూ ఈటలను సస్పెండ్ చేశారు. దీంతో ఈ సమావేశాల్లో ఈటలపై కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారు? సభలోకి బీజేపీ ఎమ్మెల్యేలు వస్తే.. సస్పెండ్ చేస్తారన్న అనుమానం కలిగింది. అయితే అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు సెషన్ మొత్తం సభలో కొనసాగారు. సభ ప్రారంభమైన మొదటిరోజు మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సుమారు ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత అధికారపార్టీ నేతలు ఈటలను తమ వాడిగా చెప్పుకోవడం వంటి పరిణామాలు రాజకీయ విశ్లేషకుల్లో కొత్త చర్చకు దారితీశాయట.

మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సైతం ఈటల రాజేందర్ గతంలో బీజేపీపై మాట్లాడిన మాటలను వీడీయో రూపంలో ప్రజెంటేషన్ చేసి మరీ.. అన్న అంటూ ప్రేమ కురిపించారు. అసలు ఈటల మోహం చూడటానికే ఇష్టపడని కేసీఆర్.. ఏకంగా పదిసార్లు ఈటల పేరెత్తారు. ఆయన అనుభవం, సలహాలు తీసుకోవాలని హరీష్ రావుకు సూచించడం ఒక ఎత్తు అయితే... ఈటల సమక్షంలో మోదీని రెండుగంటలపాటు విమర్శలు చేయడంతో .. డిఫెన్స్ లో పడిపోవడం ఈటల వంతయింది. కనీసం అటు ఈటల కానీ.. ఇటు రఘునందన్ రావు గానీ అఢ్డుతగలకపోగా.. సైలెంట్ గా వింటూ ఉండిపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఈటల, రఘునందన్ రావుల వ్యవహారంపై పార్టీలో అనుమానపు చర్చలు సాగుతున్నాయి. ప్రపంచం అంతా పొగుడుతున్న ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నా సభలోనే ఉండి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కనీసం నోరు మెదపక పోవడం ఏంటంటూ ప్రశ్నించుకుంటున్నారట. సభలో ఉండి కనీసం కేసీఆర్ వ్యాఖ్యలకు అడ్డు చెప్పక పోవడం ఏంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతోందట. వారు బీజేపీ ప్రతినిధులుగానే సభలో ఉన్నారా లేక మరేదైనా ఉద్దేశంతో కేసీఆర్ మాటకు అడ్డు చెప్పలేదా అన్న చర్చ కూడా మొదలైందట. అధిష్టాంనం దీనిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ నేతల మధ్య మాత్రం చర్చ జోరుగా సాగుతోందట.

అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ అంశంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బండారం బయట పెట్టేందుకు తమ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా అలా వ్యవహరించి ఉంటారని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ చెప్పే మాటలు రాష్ట్రంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని .. ఆయన అబద్ధాలు ప్రజలు వినాలన్న ఉద్దేశమే తప్ప మరేది లేదని దాటవేస్తున్నారట బండి సంజయ్. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు సభలో మిన్నకుండకుండా... సీఎం స్పీచ్ కు అబ్జెక్షన్ చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని.. ఇప్పుడు పార్టీ మొత్తం ఎమ్మెల్యేలను అనుమానంగా చూసే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేతలే చెబుతున్నారు.

సభానాయకుడు మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుపడటం సభా సంప్రదాయం కాదని.. పార్లమెంట్ లో మోదీ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుతగిలే ప్రయత్నం చేశారని.. వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారట బీజేపీ ఎమ్మెల్యేలు. సభా సంప్రదాయాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే తాము సీఎం ప్రసంగాన్ని అడ్డుకోలేదంటూ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. అటు కేసీఆర్ మైండ్ గేమ్ ఆడారని.. తనను బద్నాం చేయడానికే వ్యూహత్మకంగా పేరు ప్రస్తావించారని ఈటల చెప్పినప్పటికీ.. ఏదో జరుగుతుందన్న చర్చ సాగుతోంది. పార్టీనుంచి గెంటేసిన తర్వాత బీఆర్ఎస్ లో చేరేది లేదని ఈటల స్పష్టం చేసినా.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ చూపిన కన్సర్న్ .. బీజేపీలో ఈటలపై అనుమానాలకు దారి తీసిందన్న చర్చ సాగుతోంది. పార్టీ ఛీఫ్ బండి సంజయ్ బయట కేసీఆర్ కుటుంబంపై ఎన్ని సవాళ్లు విసిరినా.. సభలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు బీఆర్ఎస్ కే ప్లస్ గా మారిందనడంలో సందేహం లేదు.

మరోవైపు కొంతకాలంగా బీజేపీలో ఆధిపత్యపోరు నడుస్తోంది. రాజేందర్ ను చేరికల కమిటీ ఛైర్మన్ గా నియమించారు. రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మినహా పెద్ద నేతలు ఎవరూ కమలం పార్టీలో జాయిన్ కాలేకపోయారు. పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర హోదాలోనే పలు కార్యక్రమాలకు ఈటల వ్యవహరిస్తున్నారు. పార్టీలో కోవర్టులున్నారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు పెద్దదూమారాన్నే రేపాయి. కోవర్టులు ఎవరో ఈటలే చెప్పాలంటూ విజయశాంతిలాంటి నేతలు బాహాటంగానే సవాల్ చేశారు. మరో మాజీఎంపీతో విభేదాలు రావడంతో.. ఈటల ఏకాకి అయ్యారని అంటున్నారు. అటు కాంగ్రెస్ ఛీఫ్ రేవంత్ సైతం ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తన స్వభావానికి బీజేపీ సరిపోదని.. కాంగ్రెస్సె ఆయనకు కరెక్ట్ అని రేవంత్ అంతర్గతంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక కొద్దిరోజులుగా ఈటల రాజేందర్ మళ్లీ సొంత గూటికి చేరబోతున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సభలో ఈటలకు, బీఆర్ఎస్ కు మధ్య జరిగిన పరిణామాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక కాంగ్రెస్ లో నూ ఇదే సన్నివేషం కనిపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో బీఆర్ఎస్ పాలన పై నిప్పులు చెరుగుతున్నారు. జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమంటూ జోస్యం సైతం చెపుతున్నారు. అయితే అసెంబ్లీలో కేసీఆర్, మంత్రులు.. మోదీని, కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో .. వారితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం కేంద్రాన్ని విమర్శించేందుకే పోటీ పడ్డారు. సీనియర్ ఎమ్మెల్యేలుగా శ్రీధర్ బాబు, భట్టి, జగ్గారెడ్డి చాలాకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటున్నారు. రేవంత్ పీసీసీ ఛీఫ్ అయ్యాక.. రేవంత్ కు సీనియర్ల మధ్య గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ పూడ్చేందుకు ఏకంగా రాష్ట్ర ఇన్ ఛార్జ్ ని మార్చి, కొత్త ఇన్ ఛార్జ్ ను నియమించి సఖ్యత కుదుర్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అసలే ఎన్నికల ఏడాది... రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం, నిరుద్యోగభృతి, ఇరిగేషన్ ప్రాజెక్టులు... ఇలా చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చాన్స్ ఉన్నా... కాంగ్రెస్ ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదనే విమర్శలు వస్తున్నాయి.

సీఎం కేసీఆర్, మంత్రులు కేంద్రాన్ని విమర్శించడంతో.. అనివార్యంగా కాంగ్రెస్ సైతం బీజేపీపైనే విమర్శలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్, ద్రవ్య వినిమయబిల్లులపై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేదనే ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయి. రేవంత్ పాదయాత్రలో తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. అసెంబ్లీలో సీన్ రివర్స్ గా ఉందన్న మాట వాస్తవం. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీలో ఉన్న అనైక్యత.. బీఆర్ఎస్ కు లాభిస్తోందంటున్నారు. రేవంత్ రెడ్డితో సీనియర్లకు ఉన్న గ్యాప్, బండితో ఈటలకు ఉన్న గ్యాప్ ను బీఆర్ఎస్ చక్కగా వాడుకుందనే చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story