Editorial: "అద్దంకిపై ఆగని దామోదర్ రెడ్డి యుద్ధం.. రేవంత్ రెడ్డికి పరోక్ష హెచ్చరిక" ?

Editorial: అద్దంకిపై ఆగని దామోదర్ రెడ్డి యుద్ధం.. రేవంత్ రెడ్డికి పరోక్ష హెచ్చరిక ?
తుంగతుర్తి కాంగ్రెస్ లో రచ్చరచ్చ; మరోసారి సీనియర్ వర్సెస్ జూనియర్; అద్దంకి దయాకర్ పై దామోదర్ రెడ్డి ప్రతాపం; పీసీసీ చీఫ్ రేవంత్ కు పరోక్ష హెచ్చరికలు; ఎస్సీ నియోజకవర్గంలో జోక్యమేంటని అద్దంకి ప్రశ్నలు

సూర్యాపేట జిల్లా "తుంగతుర్తి" నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. దశాబ్దకాలంగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి "రాంరెడ్డి దామోదర్ రెడ్డి" వర్సెస్ టీపీసీసీ కార్యదర్శి "అద్దంకి దయాకర్" అన్నట్లుగా గ్రూపులు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర్ రెడ్డి.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం.. 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో.. తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారింది. దీంతో.. అప్పటివరకు ఇక్కడ్నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. సూర్యాపేటకు వెళ్లారు. ఐనప్పటికీ తుంగతుర్తి మీద పట్టు కొనసాగిస్తున్నారు. అయితే.. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూచించిన వ్యక్తి కాకుండా.. అద్దంకి దయాకర్ బీ-ఫార్మ్ సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు అద్దంకి. దామోదర్ రెడ్డి వర్గం పూర్తిస్థాయిలో సహకరించకపోవడం వల్లే ఓడిపోయామని అద్దంకి వర్గం ఆరోపణలు సైతం చేసింది.

కొంతకాలం కిందట.. కాంగ్రెస్ సీనియర్ నాయకులైన రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లమీద.. అధిష్టానంకు అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండైన వడ్డేపల్లి రవిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు.. దామోదర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ బాంబ్ పేల్చారు అద్దంకి దయాకర్. తన ఓటమికి కారణమైన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చేలా.. దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు తెరవెనక కుట్రలు చేస్తున్నారంటూ సోనియాగాంధీ సహా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో.. తుంగతుర్తి నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ నాయకుల విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నట్లైంది.

సీన్ కట్ చేస్తే.. తాజాగా మరోసారి దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ వర్గాల మధ్య ఘర్షణ రచ్చ రచ్చయింది. తిరుమలగిరి సమీపంలో అద్దంకి దయాకర్ వర్గీయులు తుంగతుర్తి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే.. సమావేశానికి వచ్చే కార్యకర్తల కోసం టెంట్లు, కుర్చీలు, భోజన వసతి ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న దామోదర్ రెడ్డి వర్గీయులు.. అక్కడికి చేరుకొని ఏర్పాట్లను చెల్లా చెదురు చేసి.. సమావేశాన్ని భగ్నం చేశారు. "ఎన్నికలు వస్తున్నాయనగానే వచ్చే నాయకుడు అద్దంకి దయాకర్.." అంటూ నినాదాలు చేస్తూ.. సమావేశం పెట్టకూడదని అడ్డుకుని హెచ్చరించారట. చేసేదేం లేక అద్దంకి దయాకర్ వర్గీయులు అన్ని సర్దుకొని వెను తిరిగి వెళ్లిపోయారట. దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తకుండా పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయ్యారట.

అద్దంకి దయాకర్ వర్గీయుల సమావేశాన్ని.. దామన్న వర్గీయులు భగ్నం చేసిన ఘటనతో తుంగతుర్తి కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు మరోసారి రోడ్డున పడ్డట్టు అయింది. సమావేశాన్ని భగ్నం చేయడం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలు తన పర్యవేక్షణలోనే ఉన్నాయనే మెస్సేజ్ ఇచ్చారు దామోదర్ రెడ్డి. తన ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న రేవంత్ వర్గీయులైన పటేల్ రమేష్ రెడ్డికి, అద్దంకి దయాకర్ తో పాటు.. నేరుగా రేవంత్ కు తన అసమ్మతిని తెలియజేసినట్లు అయిందిని దామోదర్ రెడ్డి వర్గం అంటోంది. అయితే.. తమ సమావేశాన్ని దామోదర్ రెడ్డి వర్గీయులు భగ్నం చేయడం పట్ల అద్దంకి దయాకర్ తో పాటు.. ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో.. దామోదర్ రెడ్డి జోక్యం ఎంటని అద్దంకి దయాకర్ వర్గం ప్రశ్నిస్తోంది.

ఈ రకంగా తుంగతుర్తిలో సీనియర్ పొలిటీషియన్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ యువ నాయకుడు అద్దంకి దయాకర్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఈసారైనా కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుని.. అద్దంకి, దామోదర్ రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చేనా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనైనా హస్తం పార్టీ జెండా రెపరెపలాడేనా..? అని పార్టీ క్యాడర్ గుసగుసలాడుతోందట.

Tags

Read MoreRead Less
Next Story