Editorial: "నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ టిక్కెట్ వార్- పదవి రాకుంటే వాళ్లు జంప్?"

Editorial: నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ టిక్కెట్ వార్- పదవి రాకుంటే వాళ్లు జంప్?
నిజామాబాద్ బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ హీట్; అధిష్టానంపై ఆశావహుల ఒత్తిళ్లు; కేసీఆర్ మైండ్ లో ఎవరున్నారు?



నిజామాబాద్ జిల్లాలో ఒకేసారి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటాలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన రాజేశ్వర్ గడువు త్వరలోనే ముగుయనుంది. మరో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ఎమ్మెల్యేల కోటాలో రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాయి. ముచ్చటగా మూడో సారి కూడా రేసులో ఉన్నారట. ఈసారి వీజీ గౌడ్ కు రెన్యూ వల్ లేనట్లే అని పార్టీ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. ఒకవేళ జిల్లా నుంచే మరొకరికి అవకాశం ఇస్తే మాత్రం మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అర్కల నర్సారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

గత లోక్ సభ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి మండవను పార్టీలోకి ఆహ్వానించారు. కరుడుగట్టిన తెలుగుదేశం నేతగా అప్పటి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన మండవ.. కేసీఆర్ చొరవతో అనూహ్యంగా పార్టీ మారాల్సి వచ్చింది. ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినా అది నెరవేర లేదు. రాజ్యసభ ఎన్నిక సమయంలోనూ మండవ గురించి ప్రస్తావన వచ్చిందట. ఆయన కంటే ముందు పార్టీలో చేరిన మాజీస్పీకర్ సురేష్ రెడ్డిని అదృష్టం వరించింది. దీంతో వేచిచూసే ధోరణితో ఉన్నారు మండవ. కొత్తవారికి అవకాశం కలిపిస్తే మండవకు ఛాన్స్ లభించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మండవ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని వదులుకోకుండా ఎమ్మెల్సీ ఇవ్వొచ్చని లేదంటే వచ్చే అసెంబ్లీ ఎనికల్లో అవకాశం ఇస్తారనే ప్రచారం నడుస్తోంది.

మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. చేరిక సమయంలో కేసీఆర్, కేటీఆర్, కవితలు ఇచ్చిన హామీను పదేపదే గుర్తుచేస్తున్నారట. పనిలో పనిగా సొంత సామాజికవర్గం నేత జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి ద్వారా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే ఇప్పుడే ఉన్న అవకాశాన్ని అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారట. ఎమ్మెల్సీ ఇవ్వడం సాధ్యంకాని పక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా రూరల్ నుంచి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట నర్సారెడ్డి.

మరో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా మండలిపై గురిపెట్టారట. ఎమ్మెల్సీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. గులాబీ కండువా కప్పుకున్న సమయంలోనే పెద్దసారు తనకు రెన్యూవల్ చేస్తానని హామీ ఇచ్చారని అప్పుడు సాధ్యం కాలేదని ఈసారి మాత్రం ఖాళీ అయ్యే సీటు తనకేనని ధీమాగా ఉన్నారట. ప్రస్తుతం మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ఉన్న లలిత.. ఇటీవల సీఎం కేసీఆర్ ను కలిసి ఎమ్మెల్సీ అంశాన్ని ప్రస్తావించారట. మహిళ, మున్నూరుకాపు సామాజికవర్గం కోటాలో అవకాశం ఇవ్వాలని కోరారట. ఇటీవల నాందేడ్ లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు సరిహద్దు గ్రామాల ప్రజలను సభకు తరలించేందుకు కొన్ని బాధ్యతలు కూడా అప్పగించారు కేసీఆర్. ఎమ్మెల్సీ కోసం గట్టిగా ప్రయత్నిస్తే కనీసం వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏదో ఒకచోట అవకాశం వస్తుందనే ప్లాన్ లో ఉన్నాకట. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్ముర్.. ఈ మూడు చోట్ల ఎక్కడైనా సరే పోటీకి సై అంటున్నారట ఆకుల లలిత.

మొన్నటివరకు జిల్లా పార్టీని నడిపిన మాజీ ఎంపీపీ ఈగ గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు, మైనారిటీ నేత ముజీబ్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలను కలుస్తూ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగింది. సిట్టింగ్ కే మరోసారి రెన్యువల్ చేస్తారా? జిల్లా నేతలకే ఆ ఛాన్స్ వస్తుందా? లేక మరో జిల్లాకు ఇస్తారా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేకపోవడం నేతల్లో ఉత్కంఠకు తెరలేపింది. కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఆయన మదిలో ఏముంది? ఎవరికి ఆ ఛాన్స్ వస్తుందో వేచి చూడాలి మరి.

Tags

Read MoreRead Less
Next Story