Editorial: "చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం మధ్య పీక్స్ కు టిక్కెట్ వార్"

Editorial: చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం మధ్య పీక్స్ కు టిక్కెట్ వార్
నకిరేకల్ బీఆర్ఎస్ లో తారాస్థాయికి వర్గపోరు ; చిరుమర్తి, వేముల మధ్య రసవత్తర సమరం; వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పై ఎవరికి వారే ధీమా; యూత్ టార్గెట్ గా ఇరువురి నేతల రాజకీయం; సీటు దక్కేది ఎవరికనే దానిపై ఉత్కంఠ



నల్లగొండ జిల్లా పరిధిలోని "నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం" ఎస్సీ రిజర్వుడు కేటగిరిలో కొనసాగుతోంది. 2009లో కాంగ్రెస్ తరుఫున "చిరుమర్తి లింగయ్య" గెలవగా.. 2014 ఎన్నికల్లో మాత్రం అప్పటి TRS నుంచి "వేముల వీరేశం" విజయం సాధించారు. అనంతరం.. 2018 ముందస్తు ఎన్నికల్లో సిట్టింగ్ MLA గా ఉన్న వేముల వీరేశం మీద.. నాటి కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య స్వల్ప మెజారిటీతో గెలిచారు. అనంతరం MLA చిరుమర్తి.. మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగానే.. గులాబీ కండువా కప్పుకొని కారు ఎక్కేశారు. అంతకుముందు కూడా గులాబీ, హస్తం పార్టీల్లో ఉన్న వీరేశం, చిరుమర్తి ఉప్పూ-నిప్పూ మాదిరిగానే ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరు అధికార పార్టీలోనే కొనసాగుతున్నా విభేదాలు తారాస్థాయిలోనే ఉన్నాయట.

MLAగా గెలిచిన తర్వాత చిరుమర్తి లింగయ్య గులాబీ పార్టీలోకి వచ్చినప్పటికీ.. వీరి మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతూనే పోయిందట. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సహా.. నకిరేకల్, చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లోనూ.. ఎవరకివారు యమునాతీరే అన్నట్లుగా వ్యవహరించారట. అయితే అసలుసిసలైన గులాబీ క్యాడర్ ను అంటే.. వీరేశం వర్గాన్ని MLA చిరుమర్తి పూర్తిగా దూరం పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈక్రమంలోనే వీరేశం తన క్యాడర్ ను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారట. మున్సిపల్ ఎన్నికల్లో సొంతంగా తన అభ్యర్థుల్ని గెలిపించుకుని అధికార పార్టీకి ధీటుగా మారారట. అటు చిరుమర్తితో గులాబీ పార్టీలోకి వచ్చిన కొందరు నేతలు సైతం ఆయనతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ.. వీరేశంతో నడుస్తున్నారట. ఇది ఎమ్మెల్యే చిరుమర్తికి మరింత చిర్రెత్తించిందట. అవకాశం దొరికినప్పుడల్లా.. ఎమ్మెల్యే తన మార్క్ రాజకీయం చేస్తున్నారట.

ఇటీవల కాలంలో గులాబీ బాస్ చేసిన సర్వేల్లో చిరుమర్తి లింగయ్యకు అనుకున్నంత రిజల్ట్ రాలేదట. దీంతో బాస్ డైరెక్షన్లో ఓటర్లను ఆకట్టుకునేలా నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేశారట. రోజూ గ్రామాల్లో ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లోనే ఉంటున్నారట. పార్టీ పెద్దల చొరవతో నకిరేకల్ నియోజకవర్గానికి నిధులు తెచ్చేపనిలో ఉన్నారట. అభివృద్ది-సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమేగాక.. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్, దళిత బందు వంటి పథకాలను ఇస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారట. పనిలోపనిగా "చిరుమర్తి ఫౌండేషన్" పేరుతో.. యూత్ ని ఆకట్టుకోవడానికి కబడ్డీ, క్రికెట్ వంటి పోటీలు నిర్వహిస్తున్నారట ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. అవసరమైనప్పుడల్లా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ పదేపదే చెప్పుకొస్తున్నారట.

నాలుగేళ్లుగా రాజకీయంగా స్థబ్దుగా ఉన్న మాజీ MLA వేముల వీరేశం సైతం.. దూకుడు పెంచారట. ఎప్పటికప్పుడు క్యాడర్ కు టచ్ లో ఉంటూ.. సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారట. కరోనా టైంలో నాయకులంతా ఇళ్లకే పరిమితమైన కాలంలోనూ.. ఆపదలో ఉన్న కరోనా పేషంట్లకు అవసరమైన మందులు, ఆహారం అందించారు. కరోనాతో చనిపోయిన వారిని బంధువులు పట్టించుకోకుంటే అంత్యక్రియలు చేసి శభాష్ అనిపించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ విద్య దిశగా చేపట్టిన "ఉద్దీపన పథకం" మరింతగా విస్తరించాలని వీరేశం చూస్తున్నారట. ఇందులో భాగంగానే ఉద్దీపన ట్రస్ట్ పేరు మీద దాదాపు 82 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాను అడ్డుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ చేశామంటూ వీరేశం వర్గీయులు చెబుతున్నారు. ఈ రకంగా యూత్ టార్గెట్ గా వారికి ఉపాధితోపాటు.. వచ్చే ఎన్నికల్లో తనవైపు ఉంటారని వీరేశం భావించారని చెప్పొచ్చు.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడ్తున్నా కొద్దీ.. సిట్టింగ్ MLA చిరుమర్తి లింగయ్య, మాజీ MLA వేముల వీరేశంల మధ్య కోల్డ్ వార్ పెరుగుతోంది. "సిట్టంగ్ లకే సీటని సీఎం క్లారిటీ ఇచ్చారనీ, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా.. చిరుమర్తికే టిక్కెట్ అని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ లీడర్ కే దుక్కుతుందని వేముల వీరేశం వర్గం చెప్పుకుంటోంది. నకిరేకల్ లో యూత్ టార్గెట్ గా చేస్తున్న రాజకీయంలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story