Editorial: "ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ సీటు గల్లంతేనా..?"

Editorial: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ సీటు గల్లంతేనా..?
X
ఎల్లారెడ్డిలో రసవత్తర రాజకీయం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తంపార్టీ నుంచి గెలిచిన ఈయన ఆతర్వాత కారెక్కేశారు. మాజీఎమ్మెల్యే రవీందర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతతో సురేందర్ ను నియోజకవర్గ ప్రజలు చందాలు వేసుకుని మరీ గెలిపించారు. కానీ అనుభవం లేకపోవడమో, అధికారం చేతుల్లోకి రావడమో తెలియదు కానీ... అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత మూటగట్టుకున్నారు. కార్యకర్తలు ఆపదలో ఉన్నా స్పందించకపోవడం, తనతో వచ్చిన వారికి ప్రాధాన్యత మినహా.. పాత క్యాడర్ ను పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది.

గత ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేసిన వారిని విస్మరించడంతోనే... ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా జాజుల సురేందర్ కు దూరమవుతున్నారని సమాచారం. దీంతో ఆలోచనలో పడ్డ ఎమ్మెల్యే.. ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. సిట్టింగ్లకే మళ్లీ టెక్కెట్లు ఇస్తానని గులాబీ బాస్ ప్రకటించడంతో రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నాగిరెడ్డి పేట్ లో జరిగిన సమ్మేళనంకు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు. మళ్లీ జాజుల సురేందర్ భారీ మెజార్టీతో గెలుస్తారని కవితతో చెప్పించుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు.

ఎల్లారెడ్డిలో అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ రావు బలమైన అభ్యర్ధులుగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్- బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఈ విషయంలో కాస్త వెనుక పడ్డారు. మాజీఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సొంతపార్టీ టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుండటంతో తన సీటుకు ఎక్కడ ఎసరు పడుతుందోననే ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కాదంటే ఏపార్టీ నుంచైనా పోటీకి మదన్ మోహన్ రెడీ అవుతుండటం సురేందర్ ను డిఫెన్స్ లో పడేసింది. రవీందర్ రెడ్డి, మదన్ మోహన్ ఇతర పార్టీ ప్రత్యర్ధులైనా... వారిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చర్చ జరుగుతున్న తరుణంలో.. సొంతపార్టీలోనే ప్రత్యర్ధులవుతారా అన్న టాక్ సురేందర్ ను మరింత ఆందోళనకు గరిచేస్తోంది.

ప్రచారాలన్నింటికి చెక్ పెట్టి క్యాడర్ లో భరోసా నింపేందుకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు జాజుల సురేందర్. ఇలా ఐనా తనపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవాలని చూస్తున్నారు. టిక్కెట్ భరోసా ఉన్నా... ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియక తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది. ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న నేతలు గులాబీ గూటికి చేరుతారనేది ఉత్త ప్రచారంగా కొట్టేస్తున్నన్నా.... ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మాత్రం సీరియస్ గా తీసుకోవాలని క్యాడర్ సూచిస్తోంది. ఎల్లారెడ్డిపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని అధిష్టానం ఉవ్విళ్లూరుతున్నా... అది ఎమ్మెల్యే తీరుపైనే ఆధారపడి ఉందనే టాక్ నడుస్తోంది. సురేందర్ మారిన మనిషిగా ప్రజల అభిమానం చూరగొంటారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Next Story