Editorial: "వైసీపీలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఇన్ ఛార్జులు.. సిట్టింగుల సీటుకే ఎసరు..!"

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాలు...14 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో కర్నూలు పరిధిలో కోడుమూర్.. నంద్యాల పరిధిలో నందికొట్కూర్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లుగా ఉన్నాయి. రెండూ ఎస్సీ సెగ్మెంట్లు అయినప్పటికీ కోడుమూర్ లో మాదిగ సామాజికవర్గం ఓట్లు.. నందికొట్కూర్ లో మాల సామాజిక వర్గం ఓట్లు ఎక్కువుగా ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీలు కూడా ఆయా సామాజిక అభ్యర్థులని దృష్టిలో పెట్టుకుని టికెట్లు కేటాయిస్తూ వస్తున్నాయి.
గడిచిన ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ నినాదం వర్క్ అవుట్ అయింది. ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో కర్నూలు జిల్లాలో అనేక మంది రాజకీయాలకు పరిచయం లేని వారు కూడా గాలిలో కొట్టుకొచ్చినట్లుగా ఎన్నికల్లో గెలుపొందారు. నందికొట్కూర్ నుంచి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్థర్ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. కోడుమూర్ నుంచి డాక్టర్ జరదొడ్డి సుధాకర్ గెలిచారు. రెండు సెగ్మెంట్లలో పేరుకు ఎమ్మెల్యేలున్నప్పటికీ సమన్వయకర్తల కనుసన్నల్లోనే పాలన కొనసాగుతోంది. నందికొట్కూర్ కి షాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉండగా..కోడుమూర్ కి కుడా చైర్మన్ కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు. దీంతో ఎన్నికల అనంతరం నుంచే ఎమ్మెల్యే, సమన్వయకర్తల మధ్య ఆధిపత్య పోరు రగిలింది. అది ఇప్పటికీ చల్లారలేదు.
ఇక ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండటంతో కోడుమూర్ అధికార పార్టీలో టిక్కెట్ గోల రాజకీయ వేడి రాజేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ మళ్లీ తనకే టికెట్ రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. గడప గడపలో ప్రజలు నిలదీస్తున్నా.. అసహనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ఎమ్మెల్యే సుధాకర్ మాత్రం తోచింది సర్ది చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు. ఇటు ఇన్ ఛార్జ్ కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తనకు అనుకూలమైన వారినే నిలబెట్టుకునేలా పావులు కదుపుతున్నారట. తాజాగా కోట్ల హర్ష... టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఓ జర్నలిస్ట్ జన్మదిన వేడుకలకు హాజరు కావడం ఒక్కసారిగా రాజకీయ వేడి రాజేసింది.
సీమలో అధికార పార్టీకి చెందిన మీడియాలో ప్రతినిధిగా పనిచేస్తున్న లోకేష్... ఇటీవలే తన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పలువురు అధికార పార్టీ నేతలను ఆయన మద్దతుదారులను.. ముఖ్యంగా కోడుమూర్ కి చెందిన పలువురు మండలాల కీలక నేతలను, కోట్ల హర్ష వర్గీయులని ఆహ్వానించారట. ఈ వేడుకలకు స్వయంగా కోడుమూర్ ఇంఛార్జ్ కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి పెద్దసంఖ్యలో అనుచరులతో హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ తరుఫున పోటీలో జర్నలిస్ట్ లోకేష్ కూడా ఉంటాడని..అతనికి కోట్ల హర్ష మద్దతు పూర్తి స్థాయిలో ఉందన్న సంకేతాలు ఎమ్మెల్యే వర్గానికి బలంగా పంపినట్లైందట. కోట్ల హర్ష సపోర్ట్ తో జర్నలిస్ట్ లోకేష్ కే అధికార పార్టీ టికెట్ దక్కొచ్చని కోడుమూర్ లో తీవ్ర చర్చ సాగుతోంది.
ఇదే కోడుమూర్ టికెట్ కోసం మంత్రి ఆదిమూలపు సురేష్ గట్టిగా ట్రై చేస్తున్నారట. మా ఫ్యామిలీకి ఇంకో టికెట్ ప్లీజ్ అంటున్నారట. ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్ కర్నూల్లో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన కూడా కోడుమూర్ టికెట్ రేసులో ఉన్నట్లు టాక్. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మురళీ కృష్ణ, మణిగాంధీలు టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారట. మొత్తం మీద కోడుమూర్ ఇ న్ ఛార్జ్ కోట్ల హర్ష వర్గం సపోర్ట్ ఎవరికి ఉంటే వారికే టిక్కెట్ దక్కుతుందన్న టాక్ ఒక్కసారిగా పొలిటికల్ హీట్ ను పెంచేసింది. చూడాలి మరి ఎన్నికల నాటికి రాజకీయం ఎన్ని మలుపులు తిరగనుందో.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com