Editorial: " ఆ జిల్లానే అన్ని పార్టీల టార్గెట్.. ఎందుకు?"

Editorial:  ఆ జిల్లానే అన్ని పార్టీల టార్గెట్.. ఎందుకు?
పాలమూరుపైనే ప్రధాన పార్టీల చూపు; ముందస్తు ప్రచారంతో పెరిగిన పొలిటికల్ హీట్; అభివృద్ధి, సంక్షేమం అంటూ అధికార BRS; డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ; జోడో జోష్ తో పూర్వవైభవం దిశగా కాంగ్రెస్





రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడి పాలమూరుపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్... డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందంటూ బీజేపీ.. భారత్ జోడో జోష్ తో పార్టీ పునర్వైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికలకు ఏడాది గడువున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా క్రియాశీలక రాజకీయాలకు ఆయా పార్టీలు శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ గా మారింది. అటు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ రాజకీయాన్ని మరింత వేడెక్కెస్తోంది.

రాష్ట్రంలో హ్యాట్రిక్ లక్ష్యంగా అధికార BRS కార్యాచరణ అమలు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. దీంతో పాటు పెద్ద ఎత్తున చేరికలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన ముఖ్య నేతలు జిల్లాలో తరచుగా పర్యటిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. సీఎం కేసీఆర్ ఏడాది మొదటి వారంలో మహబూబ్ నగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. మంత్రి కేటీఆర్ ఇటీవలే నారాయణపేటలో వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే మున్సిపాల్ వార్డుల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ.. ప్రధానంగా పాలమూరు పైనే దృష్టి పెట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామయాత్ర ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచే మొదలుపెట్టారు. యాత్ర సమయంలో ప్రజా సమస్యల్ని నోట్ చేసుకున్నాడు. అప్పటినుంచే బీజేపీ ముఖ్య నాయకులు తరచు జిల్లాలో ఎక్కడో చోట పర్యటిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మహబూబ్ నగర్ వేదికవడం కూడా బీజేపీ ఫోకస్ ను తెలియజేస్తోంది. అధికారపార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెబుతూనే రాజకీయ కార్యాచరణతో పాటు కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అగ్ర నాయకులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల్లో ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో పాలమూరు నుంచే బరిలో ఉంటారని ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు ప్రజల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ పార్టీ సైతం పాలమూరుపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. చాప కింద నీరులా నియోజకవర్గాల్లో జోష్ పెంచుతోంది. వారం రోజుల క్రితం బిజినపల్లిలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు భారీ ఎత్తున జనం రావడంతో శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. రాహుల్ జోడో యాత్ర జిల్లాలో విజయవంతం కావడంతో ఆ జోష్ తో హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంచడానికి సిద్ధమవుతున్నారు.

ఇలా ఎవరికి వారు ఉమ్మడి పాలమూరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారు. పోటాపోటీగా కార్యక్రమాలతో హడావుడి పెంచేస్తున్నారు. పెరిగిన పొలిటికల్ హీట్ తో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పార్టీల నాయకులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story