Editorial: దుబ్బాక కాంగ్రెస్ లో మూడు ముక్కలాట

Editorial: దుబ్బాక కాంగ్రెస్ లో మూడు ముక్కలాట
"దుబ్బాక కాంగ్రెస్ లో 3 గ్రూపులు... ఇలా ఐతే గెలిచేదెలా?"; టిక్కెట్ లక్ష్యంగా నేతల గ్రూపు రాజకీయాలు; మూడు ముక్కలాటలో నలుగుతున్న శ్రేణులు; శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్ రెడ్డిల మధ్య పోరుతీవ్రం; కత్తి కార్తీక ఎంట్రీతో తయారైన మూడోవర్గం


సిద్దిపేట జిల్లా దుబ్బాక... పూర్తిగా వ్యవసాయాధిరిత నియోజకవర్గం. ఇక్కడ ఒకప్పుడు టీడీపీ హవా సాగగా.. ఆ తరువాత బీఆర్ఎస్‌ హవా సాగింది. ప్రస్తుతం బీజేపీ పాగా వేసింది. కాంగ్రెస్‌కు పెద్దగా గెలిచిన దాఖలాలు ఏమీ లేవు. 1983లో చివరి సారిగా కాంగ్రెస్‌ గెలిచింది. టీడీపీ ఏర్పాటుతో హస్తం పార్టీ పని ఖతం అయ్యింది. ఏదో ఉందా అంటే ఉంది అన్నట్లుగా మారింది పార్టీ పరిస్థితి. 2009లో అప్పటి వరకూ టీడీపీలో ఉన్న మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని టిక్కెట్‌ ఇచ్చారు. ముత్యంరెడ్డికి ఉన్న మంచి పేరుతో సుధీర్ఘ కాలం తరువాత కాంగ్రెస్‌ గెలిచింది. ఆ తరువాత మళ్లీ మాములే.

రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఉప ఎన్నికలో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది కాంగ్రెస్‌. అయినా... నేతల తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిది ఒక వర్గం కాగా... ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శ్రావణ్‌కుమార్‌రెడ్డిది మరో వర్గం. రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఒక్కోసారి బాహాబాహీకి దిగుతుంటాయి. కేసులూ నమోదయ్యాయి. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. దీంతో కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్న పరిస్థితి.

ఇప్పుడు కొత్తగా కత్తి కార్తీక ఎంట్రీతో మరో వర్గం ఏర్పడింది. ఇలా దుబ్బాక కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట నడుస్తోంది. కత్తి కార్తీక గత ఉపఎన్నికలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుండి పోటీ చేసి ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నుండి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. రాహుల్‌గాంధీతో కన్యకుమారి నుండి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసిన ఈమె.. టిక్కెట్‌పై భరోసాతోనే దుబ్బాక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే హాత్‌సే హాత్‌ జోడో యాత్రను ప్రారంభించినట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు. కత్తి ఎంట్రీతో కాంగ్రెస్‌లో మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా నాయకులకు, కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండానే కత్తి కార్తీక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారన్న ప్రచారముంది. దీంతో ఎవరి వెంట వెళ్లాలో అర్థం కాక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు పదమూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. నేతల తీరుతో పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు. కత్తి కార్తీక, శ్రావణ్‌కుమార్‌రెడ్డి అతిథులుగా వచ్చి వెళ్లుతున్నారని.. పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు. తండ్రి పేరుతో రాజకీయం చేయడం తప్ప కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడం లేదనేది శ్రావణ్‌కుమార్‌రెడ్డి వర్గీయుల వాదన. మరి మూడు ముక్కలాటకు అధిష్టానం తెరదించుతుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story