Editorial: పొత్తులా..? కత్తులా..?

Editorial: పొత్తులా..? కత్తులా..?
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో తారస్థాయికి టికెట్‌ పోరు; కమ్యూనిస్టులతో పొత్తులకు బీఆర్ఎస్ సంకేతాలు? ; హస్తినలో కీ రోల్ ప్లే చేసేందుకు బీఆర్ఎస్ తహతహ; ఉమ్మడి ఖమ్మంలో పట్టుకోసం వామపక్షాల ఎత్తులు; పొత్తుతో ముప్పు తప్పదని భావిస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ లు



కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా..? వామపక్షాలతో పొత్తుల కోసం బీఆర్ ఎస్ అధిష్ఠానం సంకేతాలిస్తోందా.? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టుకోసం కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారా? ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ, వామపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయా? కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయన్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డివ్యాఖ్యలు దేనికి సంకేతం?

అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వామపక్షాల పొత్తులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వామపక్షాలతో పొత్తుకు సంకేతాలు పంపిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులతో ఏర్పడిన పొత్తును కంటిన్యూ చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న కమ్యూనిస్టులు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను అడుగుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వామపక్షాలతో పొత్తు ఖరారయితే తమ సీట్లకు ముప్పు తప్పదని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ, వామపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. కూసుమంచి జనచైతన్య యాత్రలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలేరు స్థానాన్ని సీపీఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను గట్టిగా అడుగుతామన్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. కమ్యూనిస్టులకు ప్రజలు ఓట్లేసే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. పాలేరులో వార్‌ వన్‌ సైడ్‌ అని ప్రకటించి ఖమ్మం రాజకీయాల్లో కాక రేపారు.

ఖమ్మంలో ఆవిర్భావ సభ ద్వారా బలపడేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఇబ్బందికరంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు సంఘీభావం తెలిపిన బీఆర్ ఎస్ నేతలు పొత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి భిన్న వ్యాఖ్యలు చేయడం ఇరు పార్టీలలో గందరగోళానికి దారితీస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో టికెట్‌ పోరు తారస్థాయికి చేరింది. ఇప్పుడు సీపీఎం సైతం ఇక్కడ పోటీ చేస్తామనటం చర్చనీయాంశమవుతోంది.

మరోవైపు అధికార బీఆర్ఎస్ తో ఇప్పటికే కమ్యూనిస్టులు తెలంగాణలో ఒక అవగాహనకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు చర్చలు జరగలేదని వామపక్ష నేతలు అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కేసీఆర్ వైఖరిని స్వాగతిస్తున్నామని అందుకే మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామంటున్నారు కమ్యూనిస్టులు. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తోనే సాధ్యమౌతుందని కమ్యూనిస్టులు సైతం భావిస్తున్నారట. బీఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో ప్రయాణం చేయాలనీ కోరుకుంటున్న కమ్యూనిస్టులకు సముచిత స్థానం లభిస్తేనే తప్పు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని తెగేసి చెబుతున్నారు. మరి పొత్తులపై ఇరు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story