Editorial: గూడెం మహిపాల్‌కు వారి గండం తొలిగేనా..!

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేత. రెండుసార్లు విజయం సాధించడంతో నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ కొట్టేందుకు అందరి కంటే ముందే ఎన్నికల కోసం సమాయత్తమయ్యారట. ఈ క్రమంలో ఆయనకు ఇంటిపోరు తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు విజయం సాధించిన మహిపాల్ రెడ్డిని ఓ యువ నేత టెన్షన్ పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా పని చేసిన భూపాల్‌రెడ్డి సైతం టిక్కెట్ కోసం యత్నిస్తున్నారట. ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్నా ఎమ్మెల్సీగానే సరిపెట్టుకోవాల్సి రావడంతో అసంతృప్తితో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చిట్కుల్ సర్పంచ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు వ్యవహారం తలనొప్పిగా తయరైందట. నీలం మధు ముదిరాజ్ సైతం టిక్కెట్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్టానం దృష్టిలో పడేందుకు సామాజిక కార్యక్రమాలూ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పోటీగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారట.
మధుయువసేన పేరుతో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న నీలం మధు బీసీ వర్గానికి జరుగుతున్న అన్యాయంపై నిత్యం గొంతు ఎత్తుతున్నారట. గతంలో నీలం మధు ముదిరాజ్ చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టగా మంత్రి కేటీఆర్ వస్తారని బలంగా ప్రచారం సాగింది. అయితే చివరినిమిషంలో ఆయన పర్యటన రద్దవడంతో ఎమ్మెల్యేనే అడ్డుకున్నారన్న ప్రచారం సాగింది. పైగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సైతం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పటాన్‌చెరులో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, నీలం మధు ముదిరాజ్ లు అయ్యప్ప పడిపూజను పోటా పోటీగా నిర్వహించారు. ఇద్దరు నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా భారీ స్థాయిలో నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీలతో నింపేస్తుంటారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఒత్తిడితో నీలం మధు ముదిరాజ్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను అధికారులు, పోలీసులు వెంటనే తొలగిస్తున్నారట.
ఈ నేపథ్యంలో ఇటీవల ఫ్లెక్సీలు తొలగిస్తున్న సమయంలో అధికారులకు, పోలీసులకు, నీలం మధు ముదిరాజ్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. నీలం మధు ముదిరాజ్ సర్పంచ్‌గా ఉన్న చిట్కుల్ గ్రామంలో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. దీనికీ ఎమ్మెల్యే ఒత్తిడే కారణమని నీలం వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో పార్టీ శ్రేణులు నలిగిపోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇరువురి నేతల ఆధిపత్య పోరుతో అటు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా తలలు పట్టుకుంటున్నారట.
ఇద్దరు నేతల మధ్య స్ట్రీట్ ఫైట్ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళనను శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయట. పరిణామాలను అధిష్ఠానం గమనిస్తున్నా నివారణ చర్యలు చేపట్టడంలేదన్న ప్రచారం జరగుతోంది. నియోజకవర్గంలోని పరిస్థితులపై సర్వేలూ చేస్తున్నా ఎవరికీ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయడంలేదని సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com