DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌

DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌
X
ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు.... ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్‌లోనే రెండో దానికి హాజరుకావచ్చన్న విద్యా శాఖ

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉన్నవారు ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్‌లోనే రెండో దానికి హాజరుకావచ్చని వెల్లడించింది. నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో కొందరికి ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్ష ఉంది. దీంతో వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని స్పష్టం చేసింది. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో.. మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్‌లోకల్‌ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలిచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశమిస్తామని తెలిపారు. వారికి హాల్‌టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు.ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మరోవైపు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని జనగామ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ జేఏసీ ఆద్వర్యంలో మోకాళ్లపై నిల్చొని వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, 33 లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అన్నారు. అయితే గెలిపించిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయారని అంటున్నారన్నారు. దీనిపై తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా కండిస్తుందని మంగళంపల్లి రాజు తెలిపారు. నిరుద్యోగులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి డీఎస్సీ పరీక్షలు వాయిదా కోసం నిలదీయాలని రాజు నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు, కేయూ జేఏసీ నాయకులు గన్ను కార్తీక్, ఆసర్ల సుభాష్ మాట్లాడుతూ డీఎస్సీకి చదువుకోవడానికి సమయం ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి మాత్రం సమయం కావాలని కోరడానికి ఏం అర్హత ఉందని నిలదీశారు. జేఏసీ నాయకులు తుంగ కౌశిక్, వెంపటి అజయ్ మాట్లాడుతూ నిరుద్యోగులకు అండగా ఉంటా అన్న ఫ్రొఫెసర్ కోదండ రామ్, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, బాల్మ్యూరి వెంకట్, ఫొఫెసర్ రియజ్‌లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం డీఎస్సీ ఎగ్జామ్ వాయిదా వేసేంతా వరకు నిరుద్యోగులు నిరసనలు తెలుపుతారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, దినేష్, అన్వేష్, చరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Tags

Next Story